ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియని వారికి ఆన్లైన్లో 12 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించాడు.
దిశ, కంది : ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియని వారికి ఆన్లైన్లో 12 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించాడు. తీరా అవతలి వ్యక్తి చేతిలో మోసపోయానని తెలిసి మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 26న చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంకు చెందిన దేవిదాస్, నాగమణిలు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా వారి కుమారుడు అరవింద్(30)కు సమతతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.
కొద్ది రోజులుగా అరవింద్ బాధతో ఉండడం గమనించిన భార్య విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా నాకు డబ్బులు అవసరం ఉన్నాయని తెలుపగా తన బంగారం మొత్తం అరవింద్‌కు ఇచ్చింది. దానిని తాకట్టు పెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆన్లైన్ లో మొత్తం రూ.12 లక్షలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి అరవింద్ ఐడీని బ్లాక్ చేశాడని కుటుంబీకులు తెలిపారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి చేసేది లేక మనస్థాపంతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడు అరుణ్ అసలు డబ్బులు ఎవరికి ఇచ్చాడు, ఏ కారణంగా చెల్లించాడు, అనేది కేసు దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.
Read more:
Credit Card EMI Option :వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!