ప్రొఫెసర్ హరగోపాల్పై దేశద్రోహం కేసు
పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది.
దిశ, వెబ్ డెస్క్: పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలతో ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో ఉపా, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తనపై పెట్టిన దేశ ద్రోహం కేసుపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. మావోయిస్టులు తమలాంటివారిపై ఆధారపడరని, వాళ్ల మార్గం వేరని అన్నారు. మావోయిస్టుల పుస్తకాల్లో తన పేరు ప్రస్తావనకు వస్తే తనకేం సంబంధం అని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం అని అన్నారు. తనతో పాటు మొత్తం152 మందిపై కేసు పెట్టడం విషాదమన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా 2022 ఆగస్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పై ఈ కేసు నమోదు కాగా.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై ఏఏ కేసులు ఉన్నాయో బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆ క్రమంలోనే దేశద్రోహం కేసు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మీడియాకు తెలిపారు.