బిల్డింగ్ పై నుంచి పడి సుతారి మేస్త్రి మృతి
ఓ బిల్డింగ్ లో మేస్త్రి గా పని చేస్తూ మూడవ అంతస్తు నుంచి కిందపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది.
దిశ, కుత్బుల్లాపూర్ : ఓ బిల్డింగ్ లో మేస్త్రి గా పని చేస్తూ మూడవ అంతస్తు నుంచి కిందపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తుంకుంటా గ్రామానికి చెందిన పి. నాగరాజు భార్య సంగీత, ముగ్గురు పిల్లలతో కలిసి బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. నాగరాజు వృత్తి రీత్యా సుతారి మేస్త్రి గా పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే బాచుపల్లి సాయిఅనురాగ్ కాలనీలో కావ్య లే ఔట్ ప్లాట్ నెంబర్స్ 500,501 లలో కన్స్ట్రక్షన్ నడుస్తున్న బిల్డింగ్ లో కూలీ మేస్త్రిగా గత నెల రోజుల నుంచి పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో నాగరాజు నవంబర్ 4వ తేదీన బిల్డింగ్ 3వ అంతస్తు లో ఇటుక గోడ కడుతూ ప్రమాదవ శాత్తు జారీ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సరైన వైద్యం కోసం నాగరాజును నగరంలోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్చి వైద్యం అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం విషమించి బుధవారం మృతి చెందాడు. దీంతో నాగరాజు భార్య, బిడ్డలు రోడ్డున పడ్డారు. రెక్కాడితే కానీ కడుపునిండని ఆ పేద కుటుంబానికి చెందిన భార్య, బిడ్డలు రోధించడంతో కాలనీ వాసులను కలచివేసింది. భవంతి నిర్మిస్తున్న బిల్డర్ అజాగ్రత్త కారణంగా మేస్త్రి మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నాగరాజు కుటుంబానికి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎత్తరి నాని కుటుంబ సభ్యులకు భరోసా అందించారు.