పెళ్లి విందులో తుపాకీతో బెదిరింపులు
తెలంగాణలోనూ గన్ కల్చర్ పెరిగిపోతుంది. రాష్ట్రంలో ఏదో ఓ చోట తరచూ తుపాకులతో హల్ చల్ చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో/జనగామ: జనగామ జిల్లాలో తుపాకీ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం చిల్పూరు మండలం లింగంపల్లిలో ఓ వివాహ విందు సందర్భంగా భోజనం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. తాగిన మత్తులో శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన బసవరాజుల లింగంను లింగంపల్లి గ్రామానికి చెందిన చాతల్లి రత్నాకర్ తుపాకీతో బెదిరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే తుపాకీని స్వాధీనం చేసుకుని రత్నాకర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, చాతల్లి రత్నాకర్ లింగంపల్లి గ్రామంలో బెల్టు షాపు నడుపుతాడని, అతడు కొద్ది నెలల క్రితం ఆన్ లైన్ షాపింగ్ ద్వారా డమ్మీ తుపాకీ బుక్ చేసి తెప్పించుకున్నాడని సమాచారం. అయితే ఆ తుపాకీని ఎక్కడెక్కడ వినియోగించాడు, ఎవరికైనా ఇచ్చాడా.., ఎవరిని బెదిరించాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అతడు నిజంగా ఆన్ లైన్ ద్వారా తుపాకీ తెప్పించుకున్నాడా.. లేక ఎవరి నుంచైనా కొనుగోలు చేశారా అనే విషయం పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది.
Also Read....