పైపులు వేసేందుకు తీసిన గుంతలో పడి వ్యక్తి మృతి
పైపులు వేస్తుండగా గుంతలో పడి మట్టి కుప్పకూలిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, మేడ్చల్ టౌన్ : పైపులు వేస్తుండగా గుంతలో పడి మట్టి కుప్పకూలిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం వడ్డెమాను శివ (35) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కుక్కట్ పల్లి ఇందిరా నగర్ లో నివాసం ఉంటూ కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. శివ కూలిపని నిమిత్తం ఈనెల 5న మేడ్చల్ జిల్లా ముడుచింతలపల్లి మండలం పోతారం చౌరస్తా వద్ద ఉన్న వెంకట సాయి సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చాడు.
ఉదయం సుమారు 12:30 గంటల ప్రాంతంలో డ్రైనేజీ పైపులు వేయడం కోసం 500 మీటర్ల పొడువు 8 ఫీట్ల లోతు గా గుంతను తీసి డ్రైనేజీ పైపులు వేస్తుండగా అందులో పడిపోయాడు. వెంటనే అతని పైనుండి మట్టి కుప్పకూలి అతని పై పడడంతో అందులోనే చిక్కుకున్నాడు. జేసీబీ సహాయంతో అతన్ని బైటికి తీసి చూడగా కొన ఊపిరితో ఉండడం గమనించిన తోటి కూలీలు వంటిమామిడి లోని ఆర్వీఎం ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం నిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. శనివారం ఉదయం వడ్డెమాను శివ మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి భార్య వడ్డెమాను లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.