కూచారంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచార గ్రామ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.
దిశ, మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచార గ్రామ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఉన్న వైర్లు దగ్ధమయ్యాయి. వ్యాల్యూ ప్రొడక్ట్స్ రాగి, కాపర్ వైర్లు తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పరిశ్రమ మొత్తం ఆవహించింది. దీంతో పరిశ్రమలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు.
రెండు గంటల తర్వాత ఫైర్ ఇంజన్
పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిన కొద్దిసేపటికి నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రానికి పరిశ్రమ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. రెండు గంటల తర్వాత వచ్చిన ఫైర్ ఇంజన్ ద్వారా పరిశ్రమలో మంటలను అర్పే ప్రయత్నాలు సిబ్బంది చేపట్టారు. మెదక్ జిల్లాలోని అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతమైన కూచారం, కాళ్ళ కల్, ముప్పిరెడ్డిపల్లి ప్రాంతాలలో దాదాపు 200 కు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈ ప్రాంతానికి దూరంలో ఉన్న నర్సాపూర్, రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యం రావడంతో అగ్ని ప్రమాదం సంభవించిన పరిశ్రమలలో పూర్తిస్థాయిలో ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.