బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తల్లీకూతుళ్లు దుర్మరణం
ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని దద్దనాల (జుర్రేరు) ప్రాజెక్టు సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి (20), కుమార్తె మానస (2) అక్కడక్కడ మృతి చెందారు. లక్ష్మీ భర్త మనోహర్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్యాపిలి మండలం అలేబాద గ్రామానికి చెందిన మనోహర్ అతని భార్య లక్ష్మి, కుమార్తె మానసలు అలేబాద గ్రామం నుండి మోటార్ సైకిల్‌పై బనగానపల్లెకు లక్ష్మీ పుట్టింటికి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో దద్దనాల ప్రాజెక్టు వద్ద బనగానపల్లె నుండి ఎల్లార్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి, కూతురు మానసలు అక్కడికక్కడే మృతి చెందారు. మనోహర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎస్ఐ రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లక్ష్మీ, మానస మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించే సమయంలో మృతదేహాలను బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంచి మృతుల బంధువులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని..ఆర్టీసీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.