భార్యపై కోపంతో 15 నెలల కూతురిని గోడకేసి కొట్టిన కసాయి తండ్రి
ఇటీవల కాలంలో భార్య, భర్తల మధ్య గొడవలు రావడం కామన్ అయిపోయింది..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భార్య, భర్తల మధ్య గొడవలు రావడం కామన్ అయిపోయింది. చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఆ కోపాన్ని చిన్న పిల్లలపై చూపిస్తూ క్షణికావేశంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్యపై కోపం 15 నెలల చిన్నారిని గోడకేసి కొట్టాడు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్ గంగూర్ గ్రామానికి చెందిన జీవన్, భారతీలకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 15 నెలల ఓజస్వి అనే పాప ఇటీవల జన్మించింది. అయితే జీవన్ నిత్యం మద్యం సేవించి భారతితో గొడవ పడుతుండేవాడు. దీంతో విసిగిపోయిన భారతి కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత భర్త ఎన్నిసార్లు అడిగినా తిరిగి రాలేదు. దీంతో శనివారం జీవన్ భారతిని ఇంటికి రమ్మని పిలవడానికి అత్తారింటికి వెళ్లాడు. జీవన్, భారతిని ఇంటికి వెళ్దామని ఎంత బతిమిలాడినా దానికి భార్య నిరాకరించింది. భారతి ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన జీవన్ తన 15 నెలల పసికందును గోడకేసి కొట్టాడు. ఆ పాప అక్కడిక్కడే మృతి చెందింది. అది గమనించిన భారతి పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.