14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలో 14 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, మరో మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-10-20 12:32 GMT

దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలో 14 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, మరో మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాలు మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి.బాలిరెడ్డి సూచనలతో ఆర్‌ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఐ లు విశ్వనాధ్, లింగాధర్ టీమ్‌లు భాకరాపేట వైపు కూంబింగ్ చేస్తుండగా చిన్నగొట్టిగల్లు రోడ్ లోని కోటబయలు వద్ద కారులో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి ముగ్గురిని అరెస్టు చేయగా, పారిపోయిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పట్టు బడిన వారు చిత్తూరుకు చెందిన వారు కాగా వారి నుంచి 14 ఎర్రచందనం దుంగలు, కారు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించగా సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News