ఉరేసుకొని 10 వ తరగతి విద్యార్థిని మృతి

ఉరేసుకుని 10 వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-02-05 01:44 GMT

దిశ, మియాపూర్: ఉరేసుకుని 10 వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈస్ట్ గోదావరి జిల్లా అంబాజీపేట కు చెందిన రాయుడు వెంకటేశ్వర్లు,శిరీష దంపతులు కొడుకు మోహిత్ కూతురు సంజన 14తో కలిసి మియాపూర్‌లోని కేవిఆర్ టవర్స్‌లో బ్లాక్ - ఏ 103 లో నివాసం ఉంటున్నారు. సంజన పటాన్ చెరువు బీరంగూడ లోని అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ లో 10 వ తరగతి చదువుతోంది.

తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేయగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తుంది. ఈ శనివారం స్కూల్‌కి వెళ్లి వచ్చాక సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. తన బెడ్ రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకీ తలపులు తీయకపోవడంతో శనివారం 5:30 గంటల సమయంలో తల్లి శిరీష, అన్న మోహిత్‌లు తలుపు కొడుతూ పిలువగా ఎలాంటి స్పందన లేదు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చున్ని సహాయంతో ఊరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.

వెంటనే కిందికి దించి దగ్గరలో ఉన్న ఉద్భవ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చదువులో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Similar News