నేతల సేవలో తరిస్తూ రక్షణ గాలికొదిలిన ‘ఖాకీ’లు.. పెరుగుతున్న క్రైమ్ రేట్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ నానాటికి తీసికట్టుగా మారింది. నిజామాబాద్ రేంజ్ డీఐజీ, పోలీస్ కమిషనర్, అదనపు డీసీపీలు, ఒక ఎసీపీ, ఐదుగురు సీఐలు, లెక్కకు మించి ఎస్ఐలు, వందల సిబ్బంది ఉన్న నగరంలో సామాన్యులకు రక్షణ కరువైంది. నిఘా కెమెరాలు రిపేర్ల పేరుతో నిద్రపోతుంటే.. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు, మోసాలు అంతులేకుండా జరుగుతున్నాయి. దొంగతనాలకు లెక్కలు లేవు. రౌడీయిజం పేట్రేగిపోతుంటే సామాన్యులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించే పరిస్థితి నెలకొంది. మత్తు […]

Update: 2021-10-17 05:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ నానాటికి తీసికట్టుగా మారింది. నిజామాబాద్ రేంజ్ డీఐజీ, పోలీస్ కమిషనర్, అదనపు డీసీపీలు, ఒక ఎసీపీ, ఐదుగురు సీఐలు, లెక్కకు మించి ఎస్ఐలు, వందల సిబ్బంది ఉన్న నగరంలో సామాన్యులకు రక్షణ కరువైంది. నిఘా కెమెరాలు రిపేర్ల పేరుతో నిద్రపోతుంటే.. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు, మోసాలు అంతులేకుండా జరుగుతున్నాయి. దొంగతనాలకు లెక్కలు లేవు. రౌడీయిజం పేట్రేగిపోతుంటే సామాన్యులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించే పరిస్థితి నెలకొంది. మత్తు పదార్థాల క్రయ విక్రయాలు జరుగుతున్నా చూసీ కూడా చూడనట్లున్న పరిస్థితి నెలకొంది. నెలవారీ మామూళ్లను దర్జాగా తీసుకుంటూ కొందరు పోలీసులు నేతల సేవలో తరిస్తుంటే, మరికొందరు పోలీస్ స్టేషన్‌లు అడ్డాగా చేసుకొని సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.

సాయంత్రం ఐదు గంటలు దాటితే పైరవీకారులతో పోలీసు స్టేషన్‌లు కళకళాడుతుండగా, ప్రజల రక్షణ ఇందూర్‌లో కళా విహీనమైంది. ఖద్దరు వేసిన లీడర్లు దళారుల అవతారమెత్తి మధ్యవర్తిత్వం పేరిట మోసాలను మొదలుకొని స్టేషన్‌ల మరమ్మత్తులు, కొత్త సామాగ్రి సమకూర్చడం, బర్త్ డే పార్టీలు, వీడ్కోల పార్టీలు కూడా జరిగిపోతున్నాయి. అయితే, ప్రజలకు సేవలందిస్తున్న కొందరు అధికారులు మాత్రం నేతల ఆగ్రహానికి బలైపోతున్నారు.

సుమారు ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో ఏడు పోలీస్ స్టేషన్‌లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నా ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది. నగరంలో ప్రతీ ఓ నేరం, ఘోర జరగకుండా ఉండని రోజు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజులుగా నేరాల చిట్టాను బయటకు తీస్తే.. ఆ కేసులను చూస్తేనే భయం కలుగుతోంది. ఒకప్పుడు ఆరు పోలీస్ స్టేషన్‌లు ఆరుగురు ఎస్ఐలతో శాంతి భద్రతలను ఎలా పర్యవేక్షించారు అనే సంశయం కలుగక మానదు.

అత్యాధునిక టెక్నాలజీతో నేర పరిశోధనకు, మెరికల్లాంటి పోలీస్ అధికారులకు, సకల సౌకర్యాలు ఉన్న జిల్లా కేంద్రంలోనే శాంతి భద్రతలు గాడితప్పడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. 13 జంక్షన్‌లలో నాలుగు చొప్పున ఉన్న సీసీ కెమెరాలు మాత్రమే నగర భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఏదైనా నేరం జరిగితే అక్కడ ఉన్న ప్రైవేట్ కెమెరాల సీసీ ఫుటేజీలే దిక్కుగా మారాయి. ఇటీవల జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య పెరిగిపోవడంతో రక్షణ విషయంలో ప్రజలు అభద్రతా భావానికి గురవుతున్నారు. నగరంలోనూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తారా.? అన్నది చెప్పలేని పరిస్థితిగా మారింది.

నిజామాబాద్ నగరంలో పట్టపగలు కొందరు గంజాయి విక్రేతలు ఓ రౌడీషీటర్‌ను దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. గంజాయి అమ్మకాల విషయంలో రౌడీషీటర్ వేధిస్తుండటంతో 16 మంది మూకుమ్మడిగా దాడి చేసి మట్టుబెట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్కారు ఆసుపత్రికి వచ్చిన వివాహిత ఆటోలో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెలుగు చూసిన అనంతరం నగరంలో అత్యాచార కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గడిచిన నెలలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో.. ఆరుగురు కలిసి ఓ డిగ్రీ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఇటీవల నగరంలోని 6వ టౌన్ పరిధిలో 8, 11 సంవత్సరాల మైనర్లపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా శుక్రవారం మైనర్(12)పై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో గణేష్ నిమజ్జనం రోజు కొందరు వ్యక్తులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ యజమానిని బంధించి తీవ్రంగా చితకబాదారు. ఫంక్షన్ హాల్‌ను బలవంతంగా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాలని వంద మందితో కూడిన గ్యాంగ్.. సదరు యజమానిపై దాడికి పాల్పడింది.

ఈ ఘటన మరువక ముందే అదే షాప్ యజమానిని భారత్ బంద్ రోజు చితకబాదారు. దసరా పండుగకు వారం రోజుల ముందు అస్కియా హానీ అనే మూడు సంవత్సరాల పాప కిడ్నాప్‌నకు గురైంది. కిడ్నాపర్లు దయతలచి వదిలి వేయడంతో మహారాష్ట్రలోని నర్సిలో దొరికింది. నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనడానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. నగరాన్ని ఆనుకుని ఉన్న మాక్లూర్‌లో ఇటీవలే రెండు మర్డర్‌లు జరిగాయి.

 

Tags:    

Similar News