ఆరోగ్యశాఖ ఆందోళన.. హుజురాబాద్‌లో కరోనా ప్రమాదం
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మెజార్టీ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారని స్పష్టం చేసింది. అంతేగాక కొవిడ్ లక్షణాలతోనే రాజకీయ ప్రచారాలు, సభలకు హాజరవుతున్నట్టు గుర్తించామని వైద్యశాఖలోని ఓ కీలక అధికారి పేర్కొన్నారు. జరగబోయే ఉప ఎన్నికల కారణంగా కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా, ప్రజల నుంచి సహకారం లభించడం లేదని […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మెజార్టీ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారని స్పష్టం చేసింది. అంతేగాక కొవిడ్ లక్షణాలతోనే రాజకీయ ప్రచారాలు, సభలకు హాజరవుతున్నట్టు గుర్తించామని వైద్యశాఖలోని ఓ కీలక అధికారి పేర్కొన్నారు. జరగబోయే ఉప ఎన్నికల కారణంగా కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా, ప్రజల నుంచి సహకారం లభించడం లేదని పేర్కొన్నది. వైరస్ తీవ్రత పెరగకుండా ముందస్తు జాగ్రత్తతో ఇస్తున్న మెడికల్ కిట్లతో తమకు కరోనా రాదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో అర్ధం లేదన్నది.
ఇంటింటికీ తిరిగి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పంపిణీ చేస్తున్న కిట్లను వాడుతూ చాలా మంది విచ్చలవిడిగా బయట తిరుగుతున్నట్లు తాము గుర్తించామని హెల్త్ డిపార్ట్ మెంట్ వివరించింది. దీంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నట్లు ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. లక్షణాలున్నోళ్లంతా బయట తిరగకూడదనే సదుద్దేశంతో కిట్లు ఇస్తుంటే, అవి వాడుతూ బయట తిరగడం వలన కరోనా నియంత్రణ సాధ్యంకాదని ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. మరోవైపు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని ప్రయత్నించినా, టీకాలు పొందేందుకు జనాలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని వెల్లడించింది.
కరోనా నియంత్రణకు, పకడ్బందీగా టీకా పంపిణీకి ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను నియమించి, టీంల వారీగా ప్రజలకు అవగాహన కల్పించినా కొన్ని మండలాల్లోని ప్రజలు వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారని వైద్యశాఖ ఆఫీసర్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు టీకా కంటే ఎన్నికల ప్రచారానికే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. పైసల మీద ఉన్న ఆశ ప్రాణాల మీద లేకపోవడం సరైనది కాదని వైద్యశాఖలోని మరో కీలక అధికారి వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇంటి ముంగిట్లోకి వెళ్లినా ప్రజలు బీరు, బిర్యానీలకు మొగ్గు చూపడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఈ మేరకు హుజూరాబాద్‌తో పాటు కేసులు అధికంగా ఉన్న జిల్లాల పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ఆరోగ్యశాఖ హెచ్ఓడీలు సోమవారం అంతర్గత సమావేశం నిర్వహించుకున్నారు. రాష్ర్టంలో కరోనా వ్యాప్తి పెరగకుండా చేయాల్సిన కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించారు.
6 లక్షల మందికి కిట్లు పంపిణీ…
రాష్ర్ట్ వ్యాప్తంగా ఈ ఏడాది మే 6 నుంచి ఈ నెల 10వ తేది వరకు జరిగిన ఫీవర్ సర్వే ద్వారా 5,68,835 మందిలో కరోనా లక్షణాలను గుర్తించగా, 6,01,055 మందికి ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. వీటిలో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 58,453, పెద్దపల్లిలో 49,499, హైదరాబాద్‌లో 37,882 మందికి ఇవ్వగా, ఆదిలాబాద్‌లో 13,149, భద్రాద్రి కొత్తగూడెం 27,748, జగిత్యాల 18,760, జనగామలో 10,231, భూపాలపల్లిలో 5,188, గద్వాలలో 6,611, కామారెడ్డి లో 6,754, కరీంనగర్‌లో 11,195, ఖమ్మంలో 21,941, కొమురం భీంలో20,152, మహబూబాబాద్‌లో 11,870, మహబూబ్ నగర్‌లో 13,095, మంచిర్యాల 22,722, మెదక్‌లో 16,864, ములుగులో 6,275, నాగర్ కర్నూల్‌లో 12,565, నల్లగొండలో 19,183, నారాయణపేట్‌లో 8,224, నిర్మల్‌లో 3,685, నిజామాబాద్‌లో 13,995, రాజన్న సిరిసిల్లాలో 9,028, రంగారెడ్డిలో 27,310, సంగారెడ్డిలో 15,960, సిద్ధిపేట్‌లో 15,151, సూర్యాపేట్‌లో 28,131, వికారాబాద్‌లో 11,591, వనపర్తిలో 11,522, వరంగల్ అర్బన్‌లో 28,255, వరంగల్ రూరల్‌లో 26,438, యాదాద్రిలో 11,628 మందికి కిట్లను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే వీటిని 20,134 బృందాలు నాలుగైదు రౌండ్లలో సర్వే చేసి ఇంటింటికీ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 9,228 మందికి కిట్‌లో ఉన్న మందులు వాడినా లక్షణాలు తగ్గలేదని, దీంతో స్టెరాయిడ్స్ సూచించినట్లు వైద్యశారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
తీవ్రతను అంచనా వేస్తున్నాం..
ప్రతి రోజూ మండలాల వారీగా కేసులు, వ్యాప్తిని అంచనా వేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ముందస్తు చర్యలనూ శాఖాపరంగా తీసుకున్నా ప్రజలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది చాలా ప్రమాదం. దయచేసి అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అంతేగాక లక్షణాలు ఉన్నోళ్లంతా వెంటనే ఐసోలేట్ కావాలి. లేదంటే ఆయా ఇళ్లల్లో ఉండే హైరిస్క్ గ్రూప్‌లకు మరింత ప్రమాదం పొంచి ఉన్నది. ప్రభుత్వం, వైద్యశాఖ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేశాము. కానీ ప్రజల సహకారం లేకపోతే కరోనాను కంట్రోల్ చేయడం కష్టం. -ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జీ శ్రీనివాసరావు