మహిళా అధికారిపై కౌన్సిలర్ల వేధింపులు.. రాత్రి సమయంలో రౌండప్ చేసి..

దిశ, మెదక్ : ఆమె ఓ మహిళా గిరిజన అధికారి.. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వదలి సేవ చేయాలన్న దృక్పథంతో గ్రూప్స్ రాసింది. ప్రొబేషనరీ పీరియడ్ కావడంతో నిక్కచ్చిగా విధులు నిర్వర్తించింది. ఇదే ఆ ఆఫీసర్ చేసిన తప్పేమో ఇక వేధింపుల పర్వం మొదలైంది.. చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, ఇద్దరు యువ కౌన్సిలర్లు, మరో సీనియర్ కౌన్సిలర్లు సొంత పనులు చేయాలని వత్తిడి చేయడంతో సదరు ఆఫీసర్ ససేమిరా అనడం.. సీన్ కట్ చేస్తే తీవ్ర […]

Update: 2021-04-05 07:35 GMT

దిశ, మెదక్ : ఆమె ఓ మహిళా గిరిజన అధికారి.. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వదలి సేవ చేయాలన్న దృక్పథంతో గ్రూప్స్ రాసింది. ప్రొబేషనరీ పీరియడ్ కావడంతో నిక్కచ్చిగా విధులు నిర్వర్తించింది. ఇదే ఆ ఆఫీసర్ చేసిన తప్పేమో ఇక వేధింపుల పర్వం మొదలైంది.. చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, ఇద్దరు యువ కౌన్సిలర్లు, మరో సీనియర్ కౌన్సిలర్లు సొంత పనులు చేయాలని వత్తిడి చేయడంతో సదరు ఆఫీసర్ ససేమిరా అనడం.. సీన్ కట్ చేస్తే తీవ్ర వేధింపులకు గురి చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మెదక్ బల్దియాలో ఓ మహిళా అధికారిపై పాలకుల తీరుపై “పొలిటికల్.. ప్రెషర్” శీర్షికన శుక్రవారం దిశ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. దీంతో కొంచెం ఆత్మరక్షణలో పడ్డ పాలకులు తీరా కాస్త వేడి చల్లారగానే మళ్ళీ వేధింపులకు గురిచేయడం గమనార్హం. ఈ వరుస పరిణామాలపై జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎంట్రీతో వివాదం కాస్త సద్దుమణిగినా, నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు అలాగే ఉండడంతో సహజంగానే ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ గిరిజన మహిళపై పనిగట్టుకుని.. పెత్తనం చెలాయించడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి, ఇక ఈ వివాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నేతల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సతుల హోదా.. పతుల పెత్తనం..

గతంలో ఓ కాంట్రాక్టర్ కం కౌన్సిలర్ ఓ డోజర్ విషయంలో కాలనీ వాసుల ముందే కొట్టేంత పని చేశారు. ఫోన్ చేస్తే లేపవు నువ్వేమైన ప్రొఫెసరా..? అంటూ అంతెత్తున లేచాడు. మరో యువ కౌన్సిలర్ ఏకంగా మా పనులకే అడ్డొస్తావా అని టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి గిరిజన మహిళా అధికారిని యాభై మంది అనుచరగణంతో చుట్టుముట్టి, తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని బాధిత మహిళ వాపోయింది. అప్పటి నుండి ఎక్కడ కనపడినా బెదిరింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందని, విషయాన్ని సంబంధిత కమీషనర్‌కు చెపితే వారి జోలికి వెళ్ళొద్దని దూరంగా ఉండమని ఉచిత సలహా ఇచ్చారని, సంబంధిత మున్సిపల్ చైర్మన్ కు చెపితే పట్టించుకోలేదని సదరు ఉద్యోగి వాపోయింది. ఇక తాజాగా బుధవారం జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాలకవర్గమంతా ఏకమై సరెండర్ చేయాలని తీర్మానించడం గమనార్హం. కానీ అసలు కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం సరెండర్ చేసే అధికారం ఒక్క జిల్లా కలెక్టర్‌కే ఉండగా, నాయకులు చేసిన పనికి సొంత పార్టీ నేతలు సైతం మండిపడుతున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వార్తలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండడం, ఇక ఈ వివాదం ఎప్పుడు ఎక్కడ సమాప్తం అవుతుందంటూ.. నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తూ ఉత్కంఠ రేపుతున్నారు.

ట్రాన్స్‌ఫర్‌కు సిఫారసులు..

గిరిజన మహిళా ఉద్యోగిని వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. వారి వ్యక్తిగత పనులకు తను అడ్డుగా ఉన్నారంటూ, తరచూ తనను వేధిస్తున్నారన్నారు. కొంతమంది తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయని, ఫోన్‌లో ఇష్టానుసారంగా మాట్లాడితే.. ఆ బాధను దిగమింగుతూ తను విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. వారికి వత్తాసు పలుకుతూ తనను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని కంటతడి పెట్టారు. ఆదివారం చైర్మన్, కమిషనర్ ఇద్దరు పిలిపించుకుని నీ వల్ల కౌన్సిలర్లతో మాకు ఇబ్బందులు వస్తున్నాయని, బదిలీ చేయించుకుని ఇక్కడి నుండి వెళ్లిపోవాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం.

ఉద్యోగం కాదు.. ఊడిగం చేయాలంట..

విధి నిర్వహణలో పనిచేసే మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారులతో సహా ఆయా చైర్మన్ కొంత మంది కౌన్సిలర్లు విచ్చలవిడిగా వాడుకుంటున్నారని, అసలు చేయాల్సిన పని వదలి నేతల మాటల వినాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నాయకుల ఇళ్లల్లో పనిచేయాలని హుకుం జారీ చేశారని దీనికి కొంత మంది వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తోంది. తన పని తాను చేసుకుంటే తప్పతాగి ఫోన్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని తెలుస్తోంది, ఇద్దరు కౌన్సిలర్లు తను స్థానికంగా ఉంటుందా..? ఉంటే ఇళ్ళు ఎక్కడ అంటూ చాలాసార్లు వాకబు చేసి తరచూ రూమ్‌కు మనుషులను పంపించిన ఘటనలున్నాయని సదరు మహిళా అధికారి వాపోయారు. పట్టణ శివారులోని డంప్ యార్డ్ సమీపంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంపై అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. ఈ విషయంలో ఓ కౌన్సిలర్ మేకలు హరితాహారం మొక్కలు మేయడంతో వారించిన పాపానికి బండ బూతులు తిట్టారని,ఈ విషయంలో సంబంధిత అధికారికి మెమో సైతం ఇచ్చారు ఉన్నతాధికారులు.

మేడం ఎంట్రీతో తగ్గిన వేడి..

మెదక్ మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే ఎంట్రీతో వివాదం కాస్త సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. సదరు మహిళా అధికారితో జరిగిన విషయంపై ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదం ఇక్కడితో ఆపాలని ఇరువురినీ సముదాయించినట్టు సమాచారం. ఐతే పలువురు ఉద్యోగ, దళిత సంఘాల నేతలు మాత్రం మున్సిపల్ పాలకవర్గం చేసిన పనికి కలెక్టర్ చొరవ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

 

Tags:    

Similar News