పాస్‌పోర్టుల జారీపై సెకండ్ వేవ్ ఎఫెక్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో పాస్‌పోర్టుల జారీ నత్తనడకన నడుస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్‌లో లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలు పూర్తిగా పాస్ పోర్టుల వెరిఫికేషన్ నిలిచిపోగా.. జూన్ తర్వాతే క్రమేపీ పాస్ పోర్టుల దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం మరింత తీవ్రతను తలపిస్తున్నందున ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకున్నా.. పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య, వెరిఫికేషన్ తదితర ప్రక్రియలు […]
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో పాస్‌పోర్టుల జారీ నత్తనడకన నడుస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్‌లో లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలు పూర్తిగా పాస్ పోర్టుల వెరిఫికేషన్ నిలిచిపోగా.. జూన్ తర్వాతే క్రమేపీ పాస్ పోర్టుల దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం మరింత తీవ్రతను తలపిస్తున్నందున ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకున్నా.. పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య, వెరిఫికేషన్ తదితర ప్రక్రియలు క్రమేపీ తగ్గుతున్నాయి. దరఖాస్తుల వెరిఫికేషన్ సమయంలో ఎస్‌బీ విభాగం పోలీసులు నేరుగా దరఖాస్తుదారుని ఇంటికి వెళ్ళి వివరాలను పరిశీలించాల్సి రావడంతో సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
భారీగా తగ్గిన దరఖాస్తులు..
గతేడాది కరోనా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర రంగాల వారిపై తీవ్ర ప్రభావమే చూపింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో 2019లో 1.27 లక్షలు, సైబరాబాద్‌లో 73,755 మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో దాదాపు మొత్తం దరఖాస్తులను పోలీసులు వెరిఫికేషన్ పూర్తి చేసి పాస్ పోర్టు జారీకి రిఫర్ చేశారు. 2020లో ప్రపంచం అంతా కరోనాతో విలవిలలాడింది. కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 23 నుంచి సుమారు 45 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ కారణంగా మార్చి నెల ఆఖరి వారంతో పాటు ఏప్రిల్, మే నెలలు పూర్తిగా కార్యాలయాలు బంద్ అయ్యాయి.
జూన్ నెలలో కార్యాలయాలు క్రమేపీ తెరుచుకోవడంతో దాదాపుగా మూడు నెలల పాటు పాస్ పోర్టులకు దరఖాస్తులు అందలేదు. ఫలితంగా 2020 ఏడాదిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 92,767 దరఖాస్తులు, సైబరాబాద్‌లో 50,945 మాత్రమే పాస్‌పోర్టు దరఖాస్తులు అందాయి. దీంతో హైదరాబాద్‌లో 24 వేలకు పైగా, సైబరాబాద్‌లో 22 వేలకు పైగా దరఖాస్తులు తగ్గినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇదే కారణంగా రాచకొండ పరిధిలో 2020 ఏడాదిలో 28 వేల దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో పాస్‌పోర్టులకు సుమారు 70 వేల దరఖాస్తులు తగ్గినట్టు స్పష్టమవుతోంది.
మళ్లీ అదే ప్రభావం..
సరిగ్గా ఏడాది తర్వాత కరోనా ఎఫెక్ట్ రావడంతో మళ్లీ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నాయి. ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2021 జనవరిలో 5,347 దరఖాస్తులు, ఫిబ్రవరిలో 5,873 దరఖాస్తులు, మార్చిలో 6,789 దరఖాస్తులు అందాయి. ఇదిలా ఉండగా, కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా కన్పిస్తున్న ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ 2,806 దరఖాస్తులు మాత్రమే అందాయి. సాధారణంగా వారానికి 1000 నుంచి 1200 వరకూ అందే దరఖాస్తులు ప్రస్తుతం వారానికి 300 వరకూ దరఖాస్తులు తగ్గుతున్నట్టు పాస్ పోర్టు వెరిఫికేషన్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఇదే ప్రభావం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఉండటంతో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో ఈ నెలాఖరుకు దరఖాస్తుల తీవ్రత మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు పలువురు అధికారులు భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో మరింత వేగంగా విస్తరిస్తుండా, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను పరిమితం చేసిన నేపథ్యంలో వచ్చే నెలలో పాస్ పోర్టు కోసం దరఖాస్తులు మరిన్ని తగ్గనున్నాయి.