బ్రేకింగ్.. తెలంగాణలో మళ్లీ కరోనా ఆంక్షలు..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించే దిశగా ఆలోచిస్తోంది. కానీ నైట్ కర్ఫ్యూ అవసరం లేదని ప్రభుత్వం దాదాపుగా ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఒకవైపు వైద్యారోగ్య శాఖ వైపు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తి కట్టడి గురించి కూడా ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. తక్షణం ఆంక్షలను అమల్లోకి తేవడంపై మాత్రం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. జనం గుమికూడే అవకాశాలున్న థియేటర్లలో సగం […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించే దిశగా ఆలోచిస్తోంది. కానీ నైట్ కర్ఫ్యూ అవసరం లేదని ప్రభుత్వం దాదాపుగా ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఒకవైపు వైద్యారోగ్య శాఖ వైపు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తి కట్టడి గురించి కూడా ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. తక్షణం ఆంక్షలను అమల్లోకి తేవడంపై మాత్రం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. జనం గుమికూడే అవకాశాలున్న థియేటర్లలో సగం కెపాసిటీని మాత్రమే అనుమతించడం, బస్సుల్లో స్టాండింగ్ ప్రయాణానికి బ్రేకులు వేయడం, పెళ్ళిళ్ళకు 200 మందికి మించకుండా చూడడం, అంతిమయాత్రలో 50 మందికి మాత్రమే పరిమితం చేయడం, జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మృతదేహాలకు పారిశుద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఖననాలు, దహనాలు చేయడం లాంటి ఆంక్షలను తీసుకువచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వైద్యారోగ్య శాఖ తరఫున తీసుకుంటున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం, దాని ద్వారా వైరస్ వ్యాప్తికి ఉన్న అవకాశాలు తదితరాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. నైట్ కర్ఫ్యూ అవసరం ఉండదని భావిస్తూనే సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని సీఎం నోటీసుకు తీసుకెళ్ళడంతో ప్రస్తుత పరిస్థితుల్లో నైట్ కర్ఫ్యూ అవసరం లేదని ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది. ఇక అధికారికంగా ఎలాంటి ఆంక్షలు ఉంటాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేదానిపై సీఎస్ ప్రకటించనున్నారు. పబ్‌లు, క్లబ్‌లు, డ్యాన్సులు తదితరాలపై కూడా చర్చలు జరిగాయిగానీ విధాన నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు ఫుల్
నగరంలోని మెజారిటీ కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ ఎమర్జెన్సీ బెడ్‌లు దొరకడం గగనంగా మారింది. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది వైద్యారోగ్య శాఖ. ఇందుకోసం అత్యవసరం కాని ఆపరేషన్లన్నింటినీ వాయిదా వేయాల్సిందిగా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యానికి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బెడ్‌లు ఫుల్ అయ్యాయి. గాందీ ఆస్పత్రిలో డిస్‌ప్లే బోర్డులో బెడ్‌ల లభ్యత ఉన్నట్లు చూపిస్తున్నా వార్డుల్లో మాత్రం ఖాళీవి దొరకడంలేదు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోనూ అన్ని వార్డుల్లోని బెడ్‌లు నిండిపోయాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో అదనపు బెడ్‌లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం అదనంగా 1250 బెడ్లు కేటాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 150, నిజామాబాద్ జీజీహెచ్‌లో 250, మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో 150, నల్గొండ జీజీహెచ్‌లో 150, సూర్యాపేట జీజీహెచ్‌లో 200, ఆదిలాబాద్ రిమ్స్‌లో 200, సూర్యాపేట్ జీజీహెచ్‌లో 200 బెడ్లను కరోనా కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో బెడ్డుకు రూ. 5016 చొప్పున నెలకు రూ. 62,70,000 ఖర్చు అవుతుందని అంచనా వేసింది. మూడు నెలల కోసం రూ. 1.88 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల్లో నుంచి వీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 9,281 కరోనా బెడ్లు ఉండగా, ఇప్పుడు అదనంగా 1250 చేరాయి.
వైరస్ క్యారియర్లుగా వైద్య సిబ్బంది
తొలి వేవ్ సమయంలో గతేడాది పీపీఈ కిట్, ఫుల్ ఫేస్ మాస్క్, షీల్డ్ లాంటి చాలా జాగ్రత్తలు తీసుకున్న వైద్య సిబ్బంది ఈసారి మాత్రం కాస్త లైట్‌గానే తీసుకున్నారు. పీపీఈ కిట్‌ల అవసరం లేదని మంత్రి ఈటల రాజేందరే చెప్పడంతో ఆస్పత్రుల్లో వాటి వినియోగం లేదు. సాధారణ సమయాల్లో వాడే ఆప్రాన్ లాంటివాటితోనే కరోనా వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కొన్ని వార్డుల్లో డాక్టర్లు తెల్ల కోటు కూడా ధరించకపోవడంతో వైరస్‌ను మరో వార్డులోకి మోసుకెళ్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న ధైర్యంతో వైద్య సిబ్బంది కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పేషెంట్లకు, వారి అటెండెంట్‌లకు అంటుతోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో చాలా మంది వైద్య సిబ్బంది ఇన్‌పెక్షన్ బారిన పడుతున్నారు. అనివార్యంగా క్వారంటైన్‌లోకి వెళ్ళాల్సి రావడంతో వైద్య సేవలు అందించడానికి సిబ్బంది కొరత ఏర్పడింది.
ఆక్సిజన్‌కు పెరిగిన డిమాండ్
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దానికి తగిన సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. అవసరానికి తగినంత ఆక్సిజన్ ఉందంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చాలా ఆస్పత్రులు అదనపు ఆక్సిజన్‌ను సమకూర్చుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ఆక్సిజన్‌కు ఒక మేర భరోసా ఉన్నప్పటికీ జిల్లాలకు మాత్రం సరఫరా బాగా తగ్గిపోయింది. రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి సగటున 250 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోందని, కానీ 150 టన్నులకు మించి రావడంలేదని డీలర్ ఒకరు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు ఆక్సిజన్ విక్రయించవద్దంటూ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందాయని, కేవలం ఆస్పత్రులకు మాత్రమే సరఫరా చేయాలని నొక్కిచెప్పినట్లు ఆ డీలర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సైతం కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి తెలంగాణకు సరఫరా ఆగిపోయింది. బళ్ళారి నుంచి వచ్చే సప్లయ్ కూడా తగ్గిపోయినట్లు ఆ డీలర్ తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు వాడుతున్న ఆక్సిజన్‌ను అవసరమైనప్పుడు ఆరోగ్య శాఖకు మళ్ళించడంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినందున ఒకటి రె,డు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వ్యాక్సిన్‌కు పెరిగిన డిమాండ్
పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్న హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోడానికి క్యూ కడుతున్నారు. మరోవైపు 45 ఏళ్ళ వయసు పైబడినవారు కూడా తీసుకోడానికి అవకాశం లభించడంతో డిమాండ్ బాగా పెరిగింది. మరో రెండు రోజులకు సరిపోయే స్టాక్ మాత్రమే ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసినందున స్టాక్ వస్తుందని భావిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కరోనా పరీక్షలు చేయించుకోడానికి కూడా జనం ఎగబడుతున్నారు. రోజుకు లక్షన్నర టెస్టులు చేస్తున్నా ప్రజల నుంచి మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తి పెరిగిందన్న విషయం ప్రజలకు అర్థం కావడంతో రోడ్ల మీదకు రావడం తగ్గిందని వైద్యారోగ్య అధికారులు అభిప్రాయపడుతున్నారు.