విద్యార్థులకు కరోనా టెన్షన్.. పక్క రాష్ట్రాల్లో సెకండ్ వేవ్
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఏపీ, మహారాష్ట్రలో విద్యార్థులకు కరోనా సోకడంతో రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి ఏంటనే భయాందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ నిబంధనలు ఎక్కడా అమలుకాకపోవడంతో వైరస్‌ను ఎలా అరికడుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బోధన సమయాలను మార్చి విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తే వైరస్ వ్యాప్తి అడ్డుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. పొరుగురాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం […]
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఏపీ, మహారాష్ట్రలో విద్యార్థులకు కరోనా సోకడంతో రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి ఏంటనే భయాందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ నిబంధనలు ఎక్కడా అమలుకాకపోవడంతో వైరస్‌ను ఎలా అరికడుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బోధన సమయాలను మార్చి విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తే వైరస్ వ్యాప్తి అడ్డుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.
పొరుగురాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మందుస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో ప్రతీరోజు 50వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని, కొవిడ్ వ్యాప్తి జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు. మహారాష్ట్ర బోర్డర్ జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల డీఎంహెచ్ఓలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలో విద్యార్థులకు కరోనా
రాష్ట్ర ప్రభుత్వం సడలించిన నిబంధనలతో 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు అందరూ సూళ్లు, కాలేజీలకు హాజరవుతున్నారు. అయితే హైదరాబాద్ గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులకు, జగిత్యాల జిల్లా అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాలలను మూసివేశారు. సంగారెడ్డి జిల్లా కస్తూర్బా పాఠాశాలలో 18 మంది బాలికలకు వైరస్ సోకడంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. దీంతో పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు.
ఏపీ, మహారాష్ట్రలో విద్యార్థులకు కరోనా
ఏపీలోని తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం 435 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరందరూ తమ స్వస్థలాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు సమర్పించి పాఠశాలకు హాజరయ్యారు. అయితే ఈ నెల 9న విద్యార్థులందరికీ మరోసారి కరోనా ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించడంతో ఎలాంటి లక్షణాలు లేకున్నా 57 మంది విద్యార్థులకు పాటిజివ్‌గా తేలింది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఎంఐడీసీ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఉంటున్న 8 నుంచి 10 వ తరగతి చెందిన 44 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు పుణెలోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
సాధ్యం కాని 20 మంది విద్యార్థుల నిబంధన
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక తరగతిలో 20 మంది విద్యార్థులకు బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయినా ఇరుకు భవనాల్లో సదుపాయాలు లేకపోవడం, పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో నిబంధనలు పాటించడం కష్టతరంగా మారింది. కార్పొరేట్ పాఠశాలల్లో, కోచింగ్ సెంటర్లలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీటికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం చేపట్టకపోవడంతో పారిశుధ్యం పడకేసింది. పాఠశాల ఆవరణల్లో చెత్తచెదారం నిండిపోయాయి.
బోధనా సమయంలో మార్పు అవసరం
పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో భౌతికదూరం నిబంధనను యాజమాన్యాలు పాటించడం లేదు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. బోధనా సమయాల్లో మార్పు తేవాలి. అన్ని తరుగతుల విద్యార్థులు ఒకే సమయానికి హాజరవడం కంటే ఒక్కో తరగతికి నిర్ణీత సమయం పెడితే బాగుంటుంది. 9, 10 తరగతుల విద్యార్థులకు ఒక సమయంలో, 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మరో సమయంలో పాఠశాలలు నిర్వహిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గి వైరస్ వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.
టీచర్లకు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి : జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
‘కరోనా నియంత్రణకు జాగ్రత్తలు చేపడుతున్న ప్రభుత్వం.. టీచర్లకు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. వందల మంది విద్యార్థులు ఒకేచోట చేరడంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చాలా పాఠశాలల్లో చెత్తచెదరం పేరుకొనిపోయాయి. పాఠశాలల్లో స్కావెంజర్లను వెంటనే నియమించి పారిశుధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.