ప్రభుత్వానికి బాధ్యత ఉందా?
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. కరోనా వైరస్ దశదిశలా వ్యాపిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తూ, ఏరోజుకారోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఏపీ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నామంటున్న పాలకుల బాధ్యతారాహిత్యాన్ని కరోనా పాజిటివ్ కేసులు వేలెత్తి చూపిస్తున్నాయి. టెస్టులు వ్యాధి నివారణకు మందులు కాదని నమోదవుతున్న కేసులు హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నాయి. ఈ రోజు ఏపీలో రికార్డు స్థాయిలో […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. కరోనా వైరస్ దశదిశలా వ్యాపిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తూ, ఏరోజుకారోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఏపీ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నామంటున్న పాలకుల బాధ్యతారాహిత్యాన్ని కరోనా పాజిటివ్ కేసులు వేలెత్తి చూపిస్తున్నాయి. టెస్టులు వ్యాధి నివారణకు మందులు కాదని నమోదవుతున్న కేసులు హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నాయి.
ఈ రోజు ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 3,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులు కేవలం ఏపీకి చెందినవి కావడం విశేషం. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులేవీ లేకపోవడం ఇంకో విశేషం. కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే 994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే ఆ జిల్లాలో ప్రజల ఆందోళన ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ ఎత్తున అంటే 407 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ప్రతి జిల్లాలోనూ మూడు సంఖ్యల్లోనే పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. గత వారం రోజులుగా ఏపీలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల్లో పాత రికార్డులు బద్దలు కొడుతున్నాయి.
గత వారం రోజుల పాజిటివ్ కేసుల రికార్డులు చూస్తే…
గడచిన వారం రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. గత సోమవారం అంటే 13వ తేదీన 1,935 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి (313), శ్రీకాకుళం (249) జిల్లాల్లో పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. ఇక 14న 1916 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, చిత్తూరు (238), శ్రీకాకుళం (215) జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 15వ తేదీన ఏపీలో 2,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు (468) జిల్లా పాత రికార్డులను తుడిపేస్తూ భారీ ఎత్తున కేసులు నమోదు చేస్తే..కర్నూలు (403) దానిని అనుసరించింది. 16వ తేదీన 2,593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సింహభాగం కర్నూలు (590), తూర్పు గోదావరి (500) జిల్లాలదే. ఇక 17వ తేదీన 2,602 పాజిటివ్ కేసులు నమోదైతే…అందులో మెజారిటీ వాటా తూర్పుగోదావరి (643), గుంటూరు (367), చిత్తూరు (328), కర్నూలు (315) జిల్లాలదే. ఇక ఈ రోజు అంటే 18వ తేదీన 3,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో అత్యధికం తూర్పుగోదావరి జిల్లాలో 994 కేసులైతే… అత్యల్పం విశాఖపట్టణం జిల్లాలో నమోదైన 116 కేసులు కావడం విశేషం.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఇంత భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోంది. దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని గప్పాలు కొట్టుకుంటోంది. నమోదవుతున్న కేసుల సంఖ్యతో డిశ్చార్జ్‌ల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని సమర్థించుకుంటోంది. టెస్టులు చేసేందుకు ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు, ప్రైవేటు ల్యాబ్‌లకు కూడా అవకాశం కల్పించామని గొప్పగా చెప్పుకుంటోంది. ఇంకోవైపు సంజీవని బస్సుల ద్వారా పరీక్షలు చేస్తున్నామని గర్వపడుతోంది. మరి వ్యాధి నివారణకు చర్యలేంటి? అంటే మాత్రం మళ్లీ వీటినే రివైండ్ చేస్తోంది.
చేష్టలుడిగి కూర్చుంటూనే క్వారంటైన్ సెంటర్లలో టైముకి భోజనం పెడుతున్నాము, వైద్యులు పర్యవేక్షిస్తున్నారు, కరోనా రోగుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాము. అది 24 గంటలు పని చేస్తుంటుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాము. అంబులెన్సులు పని చేస్తున్నాయి. ఏపీ సేవలను, కరోనా కట్టడిని ప్రపంచ దేశాల రాయబారులు కూడా మెచ్చుకుంటున్నారు అని ప్రభుత్వ పెద్దలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. మరి వారు చెప్పినట్టే అంతా సవ్యంగా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు ప్రబలుతున్నాయి? రికార్డు స్థాయిలో కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? రోజు రోజుకీ మరణాల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? అంటే మాత్రం నిశ్శబ్దమే సమాధానమవుతోంది. ఇంకా రెట్టించి అడిగితే తప్పంతా ప్రజలదేనని వారి మీద తోసేస్తున్నారు.
ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతోంది?
కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. లిక్కర్ షాపుల దగ్గర్నుంచి, షాపింగ్ మాల్స్ వరకు వేటీని నియంత్రించడం లేదు. మెజారీటీ కేసులు క్వారంటైన్ సెంటర్లలోనే సోకుతున్నాయన్నది ప్రభుత్వంపైనున్న తీవ్రమైన ఆరోపణ. క్వారంటైన్ సెంటర్లలో నాసిరకం సౌకర్యాలున్నాయన్నది అక్కడ అడుగుపెట్టే ఎవరికైనా తెలుస్తుంది. అంతెందుకు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే… క్వారంటైన్ కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ కాలేజీలను ఎంచుకుంది. కాలేజీలనగానే నాలుగు గ్రూపులు, రెండు సంవత్సరాలు, స్టాఫ్ రూమ్, ల్యాబొరేటరీలు, ఆఫీసు రూములు ఉంటాయి. మరి టాయిలెట్లు, బాత్రూములు ఎన్నిఉంటాయి? అవి ఏ స్థితిలో ఉంటాయన్నది ప్రభుత్వ కాలేజీల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పగలరు. దీంతో క్వారంటైన్ సెంటర్లలో వంద లేదా యాభైమంది ఇవే బాత్రూమ్‌లు వినియోగించి కరోనాను కొనితెచ్చుకుంటున్నారు.
ఆర్మీ జవానులకు ఎదురైన అనుభవం..
పదిహేను రోజుల క్రిందట జమ్మూ కశ్మీర్‌లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించిన 50 మంది ఆర్మీ జవానులు ఏపీలోని కీలకమైన రైల్వేస్టేషన్‌లో రాత్రి 11 గంటలకు దిగారు. వీరందర్నీ వేకువ జామున నాలుగు గంటలకు ఏ జిల్లా వారిని ఆ జిల్లాకు టెస్టులు చేసి పంపిస్తామంటూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించుకున్నారు. వారందర్నీ తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లలో పడేశారు. ఉదయం 11 గంటలకి ఉప్మా పెట్టారు. దీంతో విసిగిపోయిన ఒక జవాను జిల్లా కలెక్టర్‌కి జరిగిన తతంగమంతా వివరిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. దేశ రక్షణ కోసం పాటుపడేతమను ఇంత నిర్లక్ష్యంగా చూడవద్దని ఆ మెసేజ్‌లో కోరారు. దీంతో కలెక్టర్ వస్తున్నారన్న సమాచారం అక్కడికి అందింది. వెంటనే బ్లీచింగ్ చల్లారు. క్వారంటైన్ సెంటర్లోని వారు తినేందుకు ప్లేట్లు, వాటర్ బాటిల్స్ వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు భోజనం వచ్చింది.
దీంతో నాలుగు రోజుల నుంచీ పరీక్షలకు వేచి చూస్తున్న వలస కార్మికులు తమను నాలుగు రోజులుగా పట్టించుకునే నాధుడే లేడని వాపోయారు. సాయంత్రం 4 గంటలకు స్వాబ్ కలెక్షన్‌కి సిబ్బంది వచ్చారు. ఐదు గంటలకి కలెక్టర్ వచ్చి వారితో మాట్లాడారు. జాగ్రత్తలు చెప్పారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా? అని అడిగారు… సిబ్బందిని ఎందుకు పరిష్కరించలేదు? అని నిలదీశారు… క్వారంటైన్‌లో ఉన్నవారందరూ లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఇక పరీక్ష ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టింది. ఆర్మీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెండో రోజు సాయంత్రం నెగెటివ్ వచ్చిన వారిని ఇళ్లకు పంపి, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
ఈ రెండు రోజుల్లో ఆ క్వారంటైన్ సెంటర్‌లో ఆరు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వారంతా వాడేది ఆ రెండు బాత్రూములే.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణ ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలి. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే భౌతిక దూరం ఆరడుగులు ఉండాలి. అలాంటిది క్వారంటైన్ సెంటర్లలోని ఒక్కో గదిలో పది నుంచి ఇరవై మందిని ఉంచుతున్నారు. అంతెందుకు కరోనా వైద్య చికిత్స కోసం వెళ్తున్న అనుమానితులను మున్సిపల్ వ్యానులో కుక్కలను తీసుకెళ్లినట్టు తీసుకెళ్తున్న ఉదంతం నిన్ననే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో క్వారంటైన్ సెంటర్ల నుంచి పలువురు పరారవుతున్నారు. వారే వాహకాలుగా మారుతున్నారు. ఏపీలో ఇంతవరకు ఓ 50 మంది వరకు ఇలా క్వారంటైన్ కేంద్రాలనుంచి పరారైనట్టు తెలుస్తోంది. వీరిలో ఎంతమంది వాహకాలుగా మారారో లెక్కలు పెరుమాళ్లకెరుక.
ఆఖరుకి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన వ్యాపారులు, విద్యావంతులు చైతన్యవంతమై స్వయం నియంత్రణ పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాపారులు, నరసరావుపేట చిరు వ్యాపారులు, విజయవాడలోని వివిధ కాలనీల వాసులు, వైజాగ్‌లోని పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, విజయనగరం జిల్లాలోని బాలాజీ మార్కెట్, బట్టలు, కిరాణా వ్యాపారులు స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. వారం రోజుల పాటు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచుతామని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వస్తేనే సామాన్లు ఇస్తామని కరాఖండీగా చెబుతున్నారు.
ఖరీఫ్ సీజన్.. భౌతిక దూరం ఎట్టా?
ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏపీలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఆరంభమయ్యాయి. నారు మళ్లలో, నాట్లు వేసే సమయంలో మాస్కులు కట్టుకుని పని చెయ్యడం ఆ బ్రహ్మతరం కూడా కాదేమో.. ఇక ఈ పనుల కాలంలో దమ్ము పట్టేందుకు, నాట్లు వేసేందుకు, కలుపు తీసేందుకు మనుషులను పిలవాల్సి ఉంటుంది.. మరి ఇక్కడ వ్యవసాయ కూలీలతో భౌతిక దూరం పాటించేది ఎలా? వీటన్నింటికీ ప్రభుత్వం ఏం చెబుతుంది?.. ప్రాణ భయంతో కష్టంగా ఊపిరిపీల్చేదెలా?.. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పప్పులతో కాల గడుస్తుందా? నూనెలు, ఉప్పులు, కారాలు ఎలా వస్తాయి? పండించకుంటే ఆహారధాన్యాలు ఎలా వస్తాయి? అని వ్యవసాయదారులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలేం కోరుకుంటున్నారు?
కరోనాకి మందు లేదని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు ప్రభుత్వమే ఆదాయం కోసం ఎందుకు వెంపర్లాడుతోంది? ప్రభుత్వాలే ఆదాయం కోసం వెంపర్లాడుతున్నప్పుడు సామాన్య పౌరుడి జీవనమెట్లా సాగుతుంది? ఇప్పటికే ఉద్యోగులు కోల్పోయి ఎంతో మంది ఇళ్లలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూటగడవడం ఎలా? తిరుమల, శ్రీకాళహస్తి, వంటి గుళ్లను కూడా కరోనా వదలడం లేదు. వాటిని ఎందుకు ఓపెన్ చేసినట్టు? రెండు నెలల విరామం తరువాత మద్యానికి ఎందుకు అనుమతినిస్తున్నట్టు? రెండు నెలలపాటు ఎలాంటి క్రిమినల్ చర్యలు లేవు. లాక్‌డౌన్ సడలింపుల నుంచి ఏపీలో కనీసం పది రేపులు వెలుగు చూసి ఉంటాయి. గంజాయి, మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు కొదువే లేదు. దీంతో ప్రజలకు నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వమే రేషన్ సరఫరా చేసి, మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తే కరోనా కట్టడవుతుందని సూచిస్తున్నారు.