నాలుగు జిల్లాల్లో కరోనా?.. ఆందోళనలో ఏపీ

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో కూడా మరో కేసు నమోదు కావడంతో ఉత్తరాంధ్ర ఆందోళన చెందుతోంది. ప్రకాశం జిల్లాలో కరోనా బాధితుడు నెల్లూరు బస్సులో ఒంగోలు రావడంతో వైద్యశాఖాధికారులు పలు చర్యలు చేపట్టారు. వైజాగ్‌లో వైద్యాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖపట్టణంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు ఇటీవల మక్కా వెళ్లాడు. మక్కా నుంచి వారం రోజుల క్రితం విశాఖపట్టణం చేరుకున్నాడు. మూడు రోజుల క్రితం నుంచి జలుబు, […]

Update: 2020-03-20 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో కూడా మరో కేసు నమోదు కావడంతో ఉత్తరాంధ్ర ఆందోళన చెందుతోంది. ప్రకాశం జిల్లాలో కరోనా బాధితుడు నెల్లూరు బస్సులో ఒంగోలు రావడంతో వైద్యశాఖాధికారులు పలు చర్యలు చేపట్టారు. వైజాగ్‌లో వైద్యాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

విశాఖపట్టణంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు ఇటీవల మక్కా వెళ్లాడు. మక్కా నుంచి వారం రోజుల క్రితం విశాఖపట్టణం చేరుకున్నాడు. మూడు రోజుల క్రితం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వారం రోజులుగా ఆయన సాధారణ జీవితాన్ని అవలంభించాడు. దీంతో అల్లిపురం ప్రాంతాన్ని వైద్యాధికారులు జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతంలోని వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాడీ టెంపరేచర్ పెరిగిన వారిని హౌస్ క్వారంటైన్ చేస్తున్నారు. అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడికి వెళ్లాడు? తదితర అంశాలపై వైద్యాధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నారు.

మరోవైపు విజయనగరం జిల్లాలోని కనపాక ప్రాంతంలోని సాయిబాబా కాలనీకి చెందిన కరోనా అనుమానితుడు పెద్దాసుపత్రిలో చేరాడు. 32 ఏళ్ల ఈ వ్యక్తి టాంజానియా నుంచి హైదరాబాదు మీదుగా విజయనగరం చేరుకున్నాడు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ హైదరాబాదు పంపించారు. ఒంగోలులో ఇప్పటికే రెండు కరోనా అనుమానిత కేసులు క్వారంటైన్‌లో ఉన్నాయి. నెల్లూరులో కరోనా అనుమానితులను కలిసిన నేపథ్యంలో 739 మందిని హౌస్ క్వారంటైన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో కరోనా జాగ్రత్తలపై దండోరా వేయించింది. వలంటీర్ల సాయంతో ఇంటింటికి వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. జిల్లాల పరిధిలో ఆరోగ్యశాఖాధికారులతో వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులు ఆసుపత్రికి చేరగానే.. వారు ఎవరెవర్ని కలిశారు. ఎంత మందితో సంబంధాలు నెరిపారు అన్న విషయాలను ఆరా తీసి, వారిళ్లకు వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు కరోనా అనుమానితుల ఇళ్లలో హైపోసోడియం క్లోరైడ్ ద్రావణంతో పరిశుభ్రం చేస్తున్నారు.

విదేశాల నుంచి వైజాగ్ చేరిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 14 రోజుల పాటు వారందర్నీ హౌస్ క్వారంటైన్ కావాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థులందరికీ కరోనాపై అవగాహన కల్పించి, ఇంటిపట్టునే ఉండాలని సూచించింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశించింది. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని, జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలను విస్మరించాలని సూచించింది.

Tags: corona virus, ap, visakhapatnam, vizianagaram, nellore, health department

Tags:    

Similar News