ఐటీలో కొలువుల గండం
న్యూఢిల్లీ : కరోనాతో సేవలు నిలిచిపోవడం, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం మూలంగా అనేక రంగాలు అయోమయంలో పడిపోయాయి. రాబడి లేకపోవడంతో వ్యయ నిర్వహణ తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాల కోత మొదలెట్టాయి. ఈ ఉద్వాసనలు ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. భారత్‌లోని ఐటీ, బీపీవో కంపెనీల్లోని మొత్తం 43.6లక్షల మందిలో 0.68శాతం మంది నిరుద్యోగులయ్యారు. ఇప్పటికే ఐటీ రంగంలో 25-30 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, మరో 60 వేల మంది వేతనం లేని సెలవులపై ఉండాల్సిన […]
న్యూఢిల్లీ : కరోనాతో సేవలు నిలిచిపోవడం, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం మూలంగా అనేక రంగాలు అయోమయంలో పడిపోయాయి. రాబడి లేకపోవడంతో వ్యయ నిర్వహణ తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాల కోత మొదలెట్టాయి. ఈ ఉద్వాసనలు ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. భారత్‌లోని ఐటీ, బీపీవో కంపెనీల్లోని మొత్తం 43.6లక్షల మందిలో 0.68శాతం మంది నిరుద్యోగులయ్యారు. ఇప్పటికే ఐటీ రంగంలో 25-30 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, మరో 60 వేల మంది వేతనం లేని సెలవులపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ప్రభావం మిగిలిన రంగాల కంటే ఐటీ రంగంపై తక్కువున్నప్పటికీ, ఉద్యోగుల తొలగింపు, జీతంలేని సెలవుల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం అధికంగా ఈ రంగంలోనే ఉన్నారు. దీనికితోడు సమీప భవిష్యత్తులో మరో విపత్తు కాచుక్కుచున్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ, బీపీవో రంగాల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని నిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు సూక్ష్మ, చిన్న మధ్య తరహా క్లయింట్ల ఖర్చులను తగ్గించుకున్నాయి. దీనివల్ల 50 నుంచి 60 వేల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లో ఉన్నారు. కరోనా అనిశ్చితి అంతర్జాతీయంగా ఉన్న ఐటీ కంపెనీలు వ్యయాల తగ్గించుకోవడం, వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఐటీ మార్జిన్లపై ఒత్తిడి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాల్లో భాగంగా తొలిగా ఉద్యోగులను తగ్గించుకునే ప్రక్రియనే ఉంటుందని తెలుస్తున్నది. కాబట్టి రెండో త్రైమాసికంలో ఎక్కువ సంఖ్యలో ఉద్వాసనలు ఉండే ప్రమాదం ఉంది. బెంచ్‌కి పరిమితమైన వారిని, లేదంటే నైపుణ్యం తక్కువగా ఉన్నవారిని ఎక్కువ సంఖ్యలో తొలగించే అవకాశాలున్నాయి. బీపీవో కంపీనీల్లోను ఇదే ధోరణి ఉంది. అయితే, కంపెనీల యాజమాన్యాలు మాత్రం, ప్రతి ఏటా పనితీరు ఆధారంగా తొలగింపు నిర్వహించినట్టే ఈసారి కూడా చేపడుతున్నట్టు చెబుతున్నప్పటికీ గణాంకాలు వేరుగా ఉన్నాయి. కరోనా ప్రభావం తగ్గించుకునేందుకు సాధారణ ప్రక్రియ పేరుతో ఉద్యోగాల తొలగింపులను పెంచాయి. ఐటీ కంపెనీల వ్యయాల్లో ఉద్యోగుల జీతాల వాటా ఎక్కువ కాబట్టి సీనియర్, మిడ్-రేంజ్ మేనేజ్‌మెంట్ వేతనాల్లో కోతలను భారీగా చేపడుతున్నాయి. అనేక కంపెనీలు సీనియర్ లెవెల్లో 15 నుంచి 20 శాతం, మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో 10 నుంచి 15 శాతం తొలగింపులను అమలు చేస్తున్నాయి.
స్టార్టప్‌ల కష్టాలు..
గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ పెరిగింది. దీని కారణంగా కూడా ఐటీ రంగంలో సిబ్బందిని తగ్గిస్తున్నట్టు, ఈ ప్రక్రియకు కొత్తగా కరోనా తోడయిందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలోని ఆర్థిక మందగమనాన్ని డిజిటల్ టెక్నాలజీతో అధిగమించవచ్చని భావించిన ఐటీ కంపెనీలకు కరోనా సంక్షోభం కొత్త చిక్కులు తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఇప్పుడిప్పుడే మొదలైన స్టార్టప్ కంపెనీల పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో వేగంగా పెరిగిన స్టార్టప్‌లలో ఈ ఉద్యోగ నష్టాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ స్టార్టప్‌లపై ఈ పరిణామాలు అధిక ఒత్తిడిని కొనసాగిస్తే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మరిన్ని ఉద్యోగాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ తగ్గించుకోవడం లాంటి నిర్ణయాలతో భారీగా ఉద్యోగాలను కూడా తగ్గిస్తున్నాయి. ఇది కొత్తగా మొదలుపెట్టిన స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని హెచ్ఆర్ కన్సల్టెన్సీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వివరించారు. తమ క్లయింట్లకు చెల్లింపు చేయడంలో ఆలస్యం జరుగుతోందని, అందుకే ఖర్చులను తగ్గించుకుంటున్నట్టు ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్ హెడ్ ఒకరు చెప్పారు. దీనివల్ల జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఒత్తిడి పెరిగి ఎక్కువ ఉద్యోగ నష్టాలను చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
తొలగింపులు సాధారణమే..
కాగ్నిజెంట్, ఐబీఎం లాంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో దిగువ స్థాయి ఉద్యోగాలను తొలగించాయి. అయితే, చట్టపరమైన ముప్పు రాకుండా, ఈ ప్రక్రియ పనితీరు ఆధారంగా ప్రతి ఏటా నిర్వహించే ప్రక్రియగానే పేర్కొంటున్నాయి. ఈ తొలగింపుల తర్వాత కొత్త నియామకాలను చేపడుతున్నామని, ఉద్యోగాల తొలగింపుల గురించి వచ్చే నివేదికలు సరైనవి కావని కంపెనీలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ కంపెనీలు మాత్రం ఉద్యోగాల తొలగింపు భారీ సంఖ్యలో లేవని, దీన్ని సాధారణ ప్రక్రియగానే భావిస్తున్నామని, కొత్త నియామకాలు చేపడతామని స్పష్టం చేస్తున్నాయి.