సేల్స్.. ‘ఫ్రూట్’ఫుల్ కాదు!
దిశ, హైదరాబాద్: కరోనా దెబ్బకు సామాన్యుడు కుదేలవుతున్నాడు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో కష్టజీవులు కడుపు మాడుతోంది. పొద్దంతా పొట్టకూటి కోసం నానా తిప్పలు పడి సంపాదించిన దాంతో రోజులు వెళ్లదీసే నిరు పేదలకు కరోనా కష్టాలు ఇప్పట్లో తప్పేట్టు లేదు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత పేరుగాంచిన సరూర్ నగర్ హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్.. పండ్లను విక్రయించేవారు, కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. రోజువారీగా దిగుమతి పనులు లేనందున ఇదే మార్కెట్‌ను జీవనాధారం చేసుకున్న […]
దిశ, హైదరాబాద్: కరోనా దెబ్బకు సామాన్యుడు కుదేలవుతున్నాడు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో కష్టజీవులు కడుపు మాడుతోంది. పొద్దంతా పొట్టకూటి కోసం నానా తిప్పలు పడి సంపాదించిన దాంతో రోజులు వెళ్లదీసే నిరు పేదలకు కరోనా కష్టాలు ఇప్పట్లో తప్పేట్టు లేదు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత పేరుగాంచిన సరూర్ నగర్ హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్.. పండ్లను విక్రయించేవారు, కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. రోజువారీగా దిగుమతి పనులు లేనందున ఇదే మార్కెట్‌ను జీవనాధారం చేసుకున్న కార్మిక కుటుంబాలకు నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లే పరిస్థితిలేక కొందరు పస్తులు, మరికొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
వెలవెలబోతున్న ఫ్రూట్ మార్కెట్..
సరూర్ నగర్ ఫ్రూట్ మార్కెట్లో హోల్‌సేల్ ధరలకు పండ్లను విక్రయిస్తుంటారు. చాలా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తాయి. అందుకే ఈ మార్కెట్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ మార్కెట్‌కొచ్చే సరుకులను దిగుమతి చేయడం, మార్కెట్‌లో పండ్ల అమ్మకాలు, కొనుగోలుతో ఎప్పడూ సందడిగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో బత్తాయి అధికంగా దిగుమతి అవుతోంది. మామిడి సీజన్ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం కానుంది. వీటితోపాటు ఆపిల్, దానిమ్మ, పుచ్చకాయ, కర్భూజ, ద్రాక్ష తదితర పండ్లు రోజూ మార్కెట్‌కు వస్తుంటాయి. గతేడాది 2019 మార్చిలో 26 వేల టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయి. కాగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచింది. ప్రభుత్వం నుంచి ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ అమ్మకాలకు అనుమతి ఉన్నప్పటికీ, ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి లేనందున ఒక్కసారిగా వ్యాపారాలు ఢమాల్‌మంటూ పడిపోయాయి. దీంతో సరూర్ నగర్ ఫ్రూట్ మార్కెట్ తో పాటు రోజూ కళకళలాడే హోల్ సేల్ మార్కెట్లు ఒక్కసారిగా అమ్మకాలు లేక కళాహీనంగా మారాయి. ఈ ఏడాది (2020) మార్చి నెలలో ఇప్పటి వరకూ 9,500 టన్నులు మాత్రమే మార్కెట్ కు పండ్లు దిగుమతి కావడంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పనుల్లేక పూట గడవక..
ఈ మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతి కావడమే కాకుండా, ఇక్కడి నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, జైపూర్, మధుర, భోపాల్, లక్నో, ఉజ్జయిని, బరోడా తదితర ప్రాంతాలకు సైతం పండ్లు ఎగుమతులు అవుతుంటాయి. దాదాపు 3 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ మార్కెట్ పై ఆధారపడతారు. హమాలీలు 350, పండ్లను విక్రయించే వారు 240 మంది మాత్రమే మార్కెట్ ద్వారా గుర్తింపు పొందిన వారు ఉన్నారు. మిగతా వారంతా అవసరానికి అనుగుణంగా మార్కెట్ పనుల్లో నిమగ్నమవుతూ వారి కుటుంబాలకు ఆధారంగా ఉంటారు. హోల్ సేల్ మార్కెట్ కావడంంతో రిటైల్ వ్యాపారులు సైతం ఇక్కడే పండ్లను కొనుగోలు చేస్తూ పలు ప్రాంతాలలో అమ్ముకుంటూ తమ కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తారు. ఈ మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ, కరోనా ప్రభావంతో దిగుమతులు 90 శాతం పడిపోయాయి. కేవలం 10 శాతం దిగుమతులతో మాత్రమే మార్కెట్ నడుస్తోంది. ఉదయం ఒక గంట మాత్రమే పండ్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మార్కెట్ అంతా పండ్లు లేక, మనుషులు లేక విలవిలలాడేతోంది. ఫలితంగా ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న 3 వేల మంది కార్మికుల కుటుంబాలు ఒక్కసారిగా అగమ్యగోచరంగా తయారయ్యాయి.
tags : corona effect, saroor nagar fruit market, exports, imports