కళామతల్లిపై కరోనా పిడుగు

దిశ, తెలంగాణ బ్యూరో : కెమెరా.. రోలింగ్.. యాక్షన్.. ఇండస్ట్రీలో ఈ డైలాగ్ వినిపించక దాదాపు రెండున్నర నెలలు దాటింది. కరోనా మొదటి వేవ్ అనంతరం ప్రారంభమైన సినిమా షూటింగ్‌లు సెకండ్ వేవ్ కారణంగా రద్దయ్యాయి. అక్కడక్కడా సీరియల్ షూటింగులు మాత్రమే కొనసాగుతున్నాయి. కళామతల్లిపై కరోనా పిడుగు పడటంతో కళనే నమ్ముకుని బతుకీడ్చుతున్న వారి జీవితాలు రోడ్డునపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా షుటింగులకు తెరపడింది. పనిలేక కార్మికులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి జీవితాలు ఆర్థికంగా […]

Update: 2021-06-18 15:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కెమెరా.. రోలింగ్.. యాక్షన్.. ఇండస్ట్రీలో ఈ డైలాగ్ వినిపించక దాదాపు రెండున్నర నెలలు దాటింది. కరోనా మొదటి వేవ్ అనంతరం ప్రారంభమైన సినిమా షూటింగ్‌లు సెకండ్ వేవ్ కారణంగా రద్దయ్యాయి. అక్కడక్కడా సీరియల్ షూటింగులు మాత్రమే కొనసాగుతున్నాయి. కళామతల్లిపై కరోనా పిడుగు పడటంతో కళనే నమ్ముకుని బతుకీడ్చుతున్న వారి జీవితాలు రోడ్డునపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా షుటింగులకు తెరపడింది. పనిలేక కార్మికులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి జీవితాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అడపాదడపా అక్కడక్కడా సీరియల్ షూటింగ్స్ మాత్రమే కొనసాగుతున్నాయి. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా తగ్గించేశారు. గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగులు కొనసాగేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు కల్పించిన నాటి నుంచి సీరియల్ షూటింగ్స్ మొదలైనా పని గంటలు తగ్గడంతో కార్మికులకు జీతాలు తగ్గించారు.

కార్మికులు ఇంటికే పరిమితం

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ ప్రభావం ఒక్కో రంగంపై పడుతోంది. మనకు టెన్షన్ ఉన్నా.. బోర్ గా ఫీలయినా సినిమాకు వెళ్తుంటాం. మనకు వినోదాన్ని పంచే కళాకారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కరోనా కాలంలో సినిమా షూటింగులన్నీ రద్దు కావడంతో కళాకారుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. రోజూ వారి కూలీలుగా పనిచేసే లైట్స్ మెన్, ప్రొడక్షన్ యూనిట్, మేకప్ ఆర్టిస్ట్, మేకప్ అసిస్టెంట్, డ్రైవర్లు, టెక్నికల్ సిబ్బంది, స్టూడియో వర్కర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా మొదటి దశ నుంచి రెండో దశ వరకు కళాకారులు జీవనోపాధి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనాతో తమ పరిస్థితులు మారిపోయాయని, కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సినీ కార్మికులు.

విదేశాల్లో చిత్రీకరణకు నో చాన్స్

సీనరీల కోసం ఇతర ప్రాంతాల్లో షూటింగులకు వెళ్లడం సినీ పరిశ్రమకు కామన్. అయితే ఫస్ట్ వేవ్ అనంతరం చిత్రీకరణ ప్రారంభించారు. కొవిడ్ ఫస్ట్ వేవ్ తో మిగిలిపోయిన చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు కొందరు సిద్ధమైతే.. కొత్త సినిమాల ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టుకొని షూటింగ్ ప్రారంభించారు ఇంకొందరు. అలా మొదలైన కొద్ది రోజులకే సెకండ్ వేవ్ అటాక్ చేసింది. దీంతో విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్న వారికి నిరాశ తప్పలేదు. కొవిడ్ కారణంగా ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేయడంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. దీంతో చిత్రీకరణ మొత్తం నిలిచిపోయి సినీ కార్మికులందరూ కష్టాల పాలయ్యారు. ఇతర దేశాల్లో సినిమా చేయాలంటే సవాలక్ష రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వందల్లో సిబ్బంది అవసరముంటుంది. అనుమతులు కూడా అంత సులువుగా రావు. అవన్నీ పూర్తి చేసి షూటింగ్ కు సిద్ధమైన సమయంలో చిత్రీకరణ నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఆర్థిక భారంతో కుదేలు

సినిమా వాళ్లంటే ఎంతో గొప్పగా ఊహించుకుంటారు జనం. అయితే సినీ ప్రపంచంలో కనిపించే మెరుపుల వెనుక చీకటి ఎంతో దాగి ఉంది. ఆ చీకట్లో ఉండి ప్రపంచానికి వెలుగులు చూపించే వారే సినీ కార్మికులు. వారు ప్రొడక్షన్ లో రోజంతా కష్టపడి పనిచేస్తే పెద్ద బడ్జెట్ సినిమా రోజుకు రూ.800 నుంచి రూ.1000 దొరుకుతుంది. చిన్న బడ్జెట్ సినిమా అయితే రూ.500 మాత్రమే వస్తుంది. ఆ డబ్బుతోనే వారి పూట గడిచేది. కుటుంబ పోషణకు అదే ఆదాయం దిక్కు. అలాంటిది కరోనా కారణంగా ఇన్ని నెలలుగా షూటింగ్ లేకపోవడంతో కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

వారికి సినిమానే ప్రపంచం. వేరే పనికి వెళ్లడం కూడా తెలియదు. ఇదే వృత్తిని నమ్ముకున్నోళ్ల పరిస్థితి ఎంతో దయనీయంగా మారింది. కరోనాతో ఆర్థికంగా కుదేలైన వారి జీవితాలకు ఫస్ట్ వేవ్ సమయంలో పలువురు సినీ పెద్దలు, దాతలు నిత్యావసరాలు అందించి సాయం చేశారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో సాయమందించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దాతలెవరైనా ఉంటే ఆదుకోవాలని కోరుతున్నారు సినీ కార్మికులు.

అడపాదడపాగా సీరియల్ షూటింగ్స్

కరోనా కారణంగా సినిమా షూటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు సమయం పెంచడంతో సీరియల్ షూటింగ్స్ మొదలయ్యాయి. ఫస్ట్ వేవ్ తో అప్రమత్తమై సీరియళ్ల షూటింగులను నెలకు సరిపడా బ్యాకప్ ను ముందుగానే చిత్రీకరించినట్లు యూనిట్ తెలిపింది. ఆర్టిస్టులు, పనిచేసే కార్మికులు, సిబ్బందికి ఒకరి నుంచి ఒకరికి కరోనా అంటుకుంటుందేమోనని భయంతో నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందుకే అతి తక్కువ మందితో మాత్రమే సీరియళ్ల షూటింగ్ చేపడుతున్నట్లు చెబుతున్నారు. స్టాఫ్ ను సగం వరకు కుదించేశారు. సాధారణంగా యాభై మంది పనిచేసే చోట 20 నుంచి 25 మందితో పనిచేస్తున్నారు. దీంతో సగానికి పైగా కార్మికుల బతుకులు పనిలేక రోడ్డున పడింది. పనిలేక ఇంటికే పరిమితమయ్యారు.

పనిదినాల రెట్టింపు

కరోనా లేకముందు ఉదయం నుంచి మొదలు రాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుండేవి. అయితే కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీరియల్ రోజూ ప్రసారమవ్వాలి కాబట్టి కొంత చిత్రీకరణ ముందే పూర్తి చేయడంతో లాక్ డౌన్ సమయంలో యూనిట్ బయట పడింది. లేదంటే ఇబ్బందులు తప్పేవి కావు. ఎందుకంటే ఆర్టిస్ట్ లు తెలంగాణకు చెందినవారే కాకుండా ఇతర రాష్ట్రాలైన బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవారు కూడా తెలుగులో రాణిస్తున్నారు. దీంతో వారి డేట్లు ముందుగానే ఫిక్స్ చేస్తారు మేనేజర్లు.

లాక్ డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి రావడం ఇబ్బందిగా మారింది. లాక్ డౌన్ సడలింపు సమయం కూడా తక్కువగా ఉండటంతో మరిన్ని కష్టాలు యూనిట్ కు తోడయ్యాయి. నెల రోజుల్లో పూర్తి చేయాల్సిన షెడ్యూల్ 40 రోజులకు చేరుతోంది. సాధారణ సమయాల్లో అయితే ఒక గంట అటు ఇటుగా షూటింగ్ పూర్తి చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో షూటింగ్ ఆలస్యంతో పాటు ఖర్చు కూడా రెట్టింపైంది.

కార్మికులకు తగ్గిన పేమెంట్

అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకుంటే నిర్మాతలపై వ్యయ భారం పెరుగుతుంది. అటు సినిమాలతో పాటు ఇటు సీరియళ్లలోనూ ఇదే పరిస్థితి. ఆర్టిస్ట్ లు ఒకే సమయంలో రెండు, మూడు సీరియళ్లలో నటిస్తుండటంతో సమయం కేటాయించడం తగ్గింది. గతంలో సమయం బాగానే ఉండటంతో వారు షెడ్యూల్ తేదీలు ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకే ముగించేయాలి కాబట్టి ముందుగా నిర్ణయించుకున్నంత భాగం చిత్రీకరణ జరగడంలేదు. దీంతో సమయం పెరిగి నిర్మాతలకు భారంగా మారింది. ఈ ఎఫెక్ట్ కార్మికులపై కూడా పడింది.

కరోనాకు ముందు ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్ కొనసాగడంతో పేమెంట్ బాగానే అందేది. అయితే సమయం తగ్గడంతో పేమెంట్ కూడా తగ్గింది. దీంతో పని చేసిన కార్మికులు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. సాయంత్రం ఐదు గంటల వరకు షూటింగ్ కు ప్యాకప్ చెప్పకుంటే పోలీసుల నుంచి కూడా ఇబ్బందులు తప్పడంలేదంటున్నారు.

పలువురికి కొవిడ్

సినిమా ఇండస్ట్రీలో కొవిడ్ సోకి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో కొవిడ్ బారిన పడి ఇబ్బందులు పడ్డారు. వారి నుంచి ఇతరులకు సోకి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కార్మికలు ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారికి పలు జాగ్రత్తలు సూచించి నిత్యావసరాలు అందించి పలు చిత్ర నిర్మాణ సంస్థలు చేయూతనందించినట్లు సినీ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. అలాగే వారికి వ్యాక్సినేషన్ కూడా త్వరలో అందించేందుకు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సినీ వర్గీయులు చెబుతున్నారు.

ఇన్ టైంలో షెడ్యూల్ పూర్తికావట్లేదు

కరోనా వచ్చాక సమయం అనేది చాలా ఇంపార్టెంట్. లాక్ డౌన్ వల్ల అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం కూడా ప్రజల సంక్షేమం కోసమే. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాం. అయితే అనుకున్న సమయంలో సీరియళ్ల షెడ్యూల్ పూర్తి కావడంలేదు. ఆర్టిస్టులు రెండు, మూడు సీరియళ్లలో నటిస్తుంటారు. అయినా గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చిత్రీకరణ జరిగేది. సమయాభావం తగ్గడంతో కాల్షీట్లకు ఇబ్బందిగా మారింది. దీంతో అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కావడంలేదు. ఈ ఎఫెక్ట్ నిర్మాతపై పడింది. వ్యయ భారం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టులు కొందరు ఉన్నారు. వారు షూటింగ్ స్పాట్ కు వచ్చే వరకు చిత్రీకరణ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి.
-మహేశ్, షెడ్యూలింగ్ మేనేజర్

టెక్నికల్ ఇష్యూ వస్తే అంతే..

సాధారణ సమయాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారింది. కొత్తది తెచ్చుకుందామన్నా ఇబ్బందే. రిపేర్ చేయిద్దామన్నా ఇబ్బందే. దీనివల్ల షూటింగ్ కు ప్యాకప్ చెప్పాల్సి వస్తోంది. లేదంటే ఇతర షూటింగ్ యూనిట్ల నుంచి తెప్పించే వరకు సమయం వృథా అవుతోంది. దీంతో చిన్న చిన్న నిర్మాతలపై మోయలేని భారం పడుతోంది. వారు ఇప్పుడు నష్టాలను భరిస్తూ కూడా కొంతమందికైనా ఉపాధి కల్పిస్తున్నారు.
– రఘు, టెక్నికల్ సిబ్బంది

Tags:    

Similar News