నిద్రపోతున్న నిఘా.. కాంటాల దగా

దిశ, కరీంనగర్ : నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అధికారులు కూరగాయలు, నిత్యావసర ధరల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలన్నీ దిగొచ్చాయి. సామాన్యులు కూడా సంతోషంగా జీవనం సాగించే పరిస్థితి వచ్చింది. కానీ, అధికారుల ఎత్తుకు పై ఎత్తు వేసే వ్యాపారులు మాత్రం సామాన్యుని దోపిడీ చేయడం మాత్రం మానుకోవడం లేదు. ధరల విషయంలో అధికారులు చెప్పినట్టుగా […]

Update: 2020-04-23 23:53 GMT

దిశ, కరీంనగర్ : నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అధికారులు కూరగాయలు, నిత్యావసర ధరల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలన్నీ దిగొచ్చాయి. సామాన్యులు కూడా సంతోషంగా జీవనం సాగించే పరిస్థితి వచ్చింది. కానీ, అధికారుల ఎత్తుకు పై ఎత్తు వేసే వ్యాపారులు మాత్రం సామాన్యుని దోపిడీ చేయడం మాత్రం మానుకోవడం లేదు. ధరల విషయంలో అధికారులు చెప్పినట్టుగా తప్పకుండా అమలు చేస్తున్న కూరగాయల వ్యాపారులు లోలోపల చేస్తున్న దందా గుట్టు విప్పే వారు లేకుండా పోయారు. వారు లాభం గడించే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారులు ధరల నియంత్రణపై నజర్ వేశారు తప్ప వేరే విషయాలపై కాదు కదా అని భావించిన వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని సగటు సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త దోపిడీ..

కాంటాల మాయాజాలంతో కూరగాయలు తక్కువగా అందిస్తూ నిట్టనిలువునా ముంచుతున్నారు. కిలో కూరగాయలకు 200 గ్రాముల వరకు తక్కువగా వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెంచకుండా విక్రయిస్తున్నారన్న కారణం ముసుగులో వ్యాపారులు తూకంలో మోసం చేస్తూ సరికొత్త దోపిడీకి పాల్పడుతున్నారు. మరి కొంతమంది తూనికలు, కొలతల శాఖ అనుమతి లేని కాంటాలను, తూకం రాళ్లను ఉపయోగించి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఒక్కో మార్కెట్ లో రోజుకు క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు వినియోగదారులకు కాకుండా వ్యాపారుల వద్దే ఉండిపోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తూనికలు, కొలతల శాఖ అధికారులు తూకంలో జరుగుతున్న మోసాలను నిలువరించేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెయిట్స్ అండ్ మెజర్ మెంట్స్ అధికారులేరీ..?

లాక్ డౌన్ సమయంలో జిల్లా కలెక్టరేట్ నుంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప తూకంలో జరుగుతున్న మోసాలను గుర్తించేందుకు వెయిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రతి మార్కెట్ లోనూ ఇదే తంతు నడుస్తున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తూకంలో జరుగుతున్న మోసాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తూకంలో మోసం..

కూరగాయల ధరలు కంట్రోల్‌లో ఉంచడంలో అధికారులు సఫలం అయ్యారు. కానీ, తూకంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేయడం లేదు. కిలో కూరగాయలకు 200 గ్రాముల వరకు తక్కువగా వస్తున్నాయి. కూరగాయల వ్యాపారులు చేస్తున్న ఈ రకమైన మోసం వల్ల మధ్య, పేద తరగతి ప్రజలు
ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ మోతాదులో కూరగాయలు కొనుక్కునే వారి కుటుంబాలు మరీ ఇబ్బంది పడుతున్నాయి. అధికారులు తూకంలో జరుగుతున్న మోసాలను నియంత్రించేందుకు చొరవ చూపాలి.

– సవిత, కరీంనగర్

ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..

లాక్ డౌన్ కారణంగా మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కునే సమయం తక్కువగా ఉండటం కూడా వ్యాపారులకు వరంగా మారింది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందున కూరగాయల వ్యాపారులు చేస్తున్న మోసాలను వెంటనే పసిగట్ట లేక పోతున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూరగాయలు తూకానికన్న తక్కువగా వచ్చాయని గుర్తించాల్సి వస్తోంది. అధికారులు వ్యాపారులు చేస్తున్న ఈ మోసాలను కట్టడి చేసేందుకు ప్రత్యక చర్యలు తీసుకోవాలి.

 

– రాధ, కరీంనగర్

Tags: conte magic, selling, vegetables, mechants, fraud, people, covid 19 effect, lockdown

Tags:    

Similar News