అధిష్టానం సీరియస్.. జగ్గారెడ్డికి వార్నింగ్, రేవంత్‌కు మందలింపు

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీలో సీనియర్ల నోటికి తాళం వేసే ప్రక్రియ మొదలైంది. టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకం తర్వాత సీనియర్లు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవల కొంత స్తబ్ధుగా ఉన్నా.. మళ్లీ జగ్గారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో సీనియర్లకు ఏఐసీసీ తరుపున హెచ్చరికలు జారీ అయ్యాయి. రేవంత్​ను సపోర్ట్​ చేస్తూనే పార్టీలో అంతా కలిసి ఉండాలంటూ సూచించారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీనా.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన […]

Update: 2021-09-26 01:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీలో సీనియర్ల నోటికి తాళం వేసే ప్రక్రియ మొదలైంది. టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకం తర్వాత సీనియర్లు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవల కొంత స్తబ్ధుగా ఉన్నా.. మళ్లీ జగ్గారెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో సీనియర్లకు ఏఐసీసీ తరుపున హెచ్చరికలు జారీ అయ్యాయి. రేవంత్​ను సపోర్ట్​ చేస్తూనే పార్టీలో అంతా కలిసి ఉండాలంటూ సూచించారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీనా.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డికి సీరియస్​ వార్నింగ్​ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఆయన వెంటనే వెనక్కి తగ్గారు. తాను సారీ చెబుతున్నట్లు ప్రకటించారు. ఇక శనివారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఇప్పటిదాకా అంటీముట్టనట్టుగా ఉన్న ఉత్తమ్​, జానారెడ్డి వంటి నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కూడా సీనియర్లకు పరోక్ష వార్నింగ్​ ఇచ్చారు. నోరు జాగ్రత్త.. పార్టీ నేతలపై వ్యతిరేక విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి​ ఠాగూర్​ హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా విమర్శలు చేసే నేతలను ఉద్దేశిస్తూ ‘‘పార్టీలో ఉండటం ఇష్టం లేని నేతలు కారణాలు చెప్పాలని, పార్టీలోనే ఉంటూ విమర్శలు చేయడం కంటే బయటకు వెళ్లిపోతేనే మంచిది’’అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లు కొంత మేరకు వెనక్కి తగ్గారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వెల్లడవుతున్నాయి.

నాది తప్పే..

ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వివాదం కొలిక్కి వచ్చినట్లైంది. శనివారం ఉదయం నుంచే ఈ వ్యవహారంపై ఏఐసీసీ నుంచి వివరాలు తీసుకున్నారు. జగ్గారెడ్డి చేసిన విమర్శలపై ఆడియో టేపులను సైతం ఢిల్లీకి పంపించారు. దీంతో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్.. జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. శుక్రవారం ఘటనపై జగ్గారెడ్డి వివరణ తీసుకున్నారు. అనంతరం పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. ‘‘శుక్రవారం ఘటనను మరిచిపొండి. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం నా తప్పే. నా వైపు నుంచి తప్పు జరిగింది.. మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చా. మీడియా ముందు మాట్లాడొద్దని ఠాగూర్, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ సూచన చేశారు. మాది అన్నదమ్ముల పంచాయితీ లాంటిది. ఏఐసీసీ అధ్యక్షులు సోనియా, రాహుల్ డైరెక్షన్‌లో పనిచేస్తా. మా యుద్ధం టీఆర్ఎస్, బీజేపీ పైనే’’ అని జగ్గారెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు.

రేవంత్​కు మందలింపు..

అదే సమయంలో రేవంత్​రెడ్డిని కూడా సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు ఏవైనా.. ఎక్కడైనా నిర్వహిస్తే ఆ ప్రాంతానికి వెళ్లే ముందు సెగ్మెంట్​, జిల్లా నేతలకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని రేవంత్​రెడ్డికి సూచించారు. సంగారెడ్డికి వస్తే తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వరా అని, కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీయా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన నేపథ్యంలో రేవంత్​కు సైతం తొలి వార్నింగ్​ జారీ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రావద్దంటూ పేర్కొన్నారు.

హైకమాండ్ సీరియస్​..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. జగ్గారెడ్డి విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ క్షేత్రస్థాయి నుంచి ఆరా తీశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పులను తెప్పించుకున్నారు. ఓవైపు రేవంత్​ను సమర్ధిస్తూనే.. మరోవైపు అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సీనియర్లకు సైతం పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్​కు సీనియర్లు వచ్చి ఠాగూర్​తో భేటీ అయ్యారు.

పోడు భూముల అంశంపై రాస్తారోకో..

శనివారం సాయంత్రం గాంధీభవన్​లో కాంగ్రెస్​ పొలిటికల్​ ఎఫైర్స్​ కమిటీ సమావేశమైంది. పీఏసీ కన్వీనర్​ షబ్బీర్​ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలకాంశాలపై చర్చించారు. వచ్చేనెల 2 నుంచి డిసెంబర్​ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరుద్యోగ నిరసనల కార్యాచరణను రేవంత్​రెడ్డి వివరించారు.ఇప్పటికే దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేసినట్టే నిరుద్యోగ నిరసనలను విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా సోమవారం నిర్వహించే భారత్​బంద్​ పై చర్చించారు. ఇక వచ్చేనెల 5న పోడుభూముల అంశంపై 400 కిలోమీటర్ల రాస్తారోకో చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్​ నేతలతో మాట్లాడారు. నిరసనలను విజయవంతం చేయాలని సూచించారు. పార్టీలో అంతర్గత గొడవలు ఉంటే సీనియర్లు బయట నోరెత్తరాదని, పార్టీ అంతర్గత మీటింగ్​లో మాట్లాడాలన్నారు. బహిరంగంగా మాట్లాడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవే..

రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పర్యటనలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, విలేజ్, మండల కమిటీ, జిల్లా స్థాయి, రాష్ట్ర కమిటీలు పార్టీకి అవసరమన్నారు. జగ్గారెడ్డి శుక్రవారం మాట్లాడిన మాటలపై వివరణ ఇచ్చారని, దానిపై కూడా చర్చించామన్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే వివాదమని, జగ్గారెడ్డి మీద అధిష్టానం సీరియస్ అనేది అవాస్తమని చెప్పారు. ఆ ఎపిసోడ్‌కు జగ్గారెడ్డి ఫుల్ స్టాప్ పెట్టాడని, రెండు వైపులా తప్పులున్నాయన్నారు. కింది క్యాడర్ పరేషాన్ కానవసరం లేదని ఆయన చెప్పారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనని మహేష్​ కుమార్​ గౌడ్​ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News