క్షమాపణ చెప్పని సిద్దిపేట కలెక్టర్.. వెనక్కి తగ్గిన కాంగ్రెస్?

దిశ ప్రతినిధి, మెదక్: అన్నదాతలను అవమానించేలా, కించపరిచేలా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట స్పందించింది. టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కలెక్టర్ తీరును ఖండించారు. ఆ వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. రైతులకు నేరుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. అయినా, ఇప్పటి వరకు ముట్టడించలేదు కదా అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపై జిల్లాలో మరోచర్చ నడుస్తోంది. […]

Update: 2021-10-28 06:34 GMT

దిశ ప్రతినిధి, మెదక్: అన్నదాతలను అవమానించేలా, కించపరిచేలా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట స్పందించింది. టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కలెక్టర్ తీరును ఖండించారు. ఆ వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. రైతులకు నేరుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. అయినా, ఇప్పటి వరకు ముట్టడించలేదు కదా అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపై జిల్లాలో మరోచర్చ నడుస్తోంది. కలెక్టర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఏమైనా సానుభూతి చూపుతుందా అంటూ కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉండగా కాసేపటి క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పారు. ఇరుపార్టీల్లో ఎవరూ ముందుగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తారో చూడాలి.

కలెక్టర్‌పై కాంగ్రెస్ వెనక్కి తగ్గిందా

కాంగ్రెస్ పార్టీ తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొన్నటి రోజున కలెక్టర్ మాట్లాడిన మాటలు ఖండించారు. కలెక్టర్ నేరుగా రైతులకు క్షమాపణ చెప్పాలని, మీడియాపై నెట్టేయ్యడం సరికాదని, కలెక్టర్‌కు 24 గంటల సమయం ఇస్తున్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని, వారి ఇంటిని ముట్టడిస్తామని మీడియా సమావేశంలో చెప్పారు. అయినా, ఇప్పటివరకు కలెక్టర్ క్షమాపణ చెప్పలేదు సరికదా దానిపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. పైగా వీడియో తీసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. కాంగ్రెస్ 24 గంటల సమయం దాటి 48 గంటలకు చేరింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యచరణకు పూనుకోలేదు. దీనిపై కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో, జనాల్లో కాంగ్రెస్ పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ కలెక్టర్ తీరుపై సరైన వైఖరి చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

నోరు విప్పని టీఆర్ఎస్

ఇది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఇప్పటి వరకు కలెక్టర్ తీరును ఖండించలేదు. ఆది నుండి సిద్దిపేట కలెక్టర్ అధికార టీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులు పదేపదే చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ మాటలే నిజం అనేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడమే ఇందుకు సంకేతం. దీనిపై రైతులు ఆగ్రహం చేస్తున్నారు. రైతులను కించపరిచేలా మాట్లాడిన కలెక్టర్‌కు అధికార పార్టీ వత్తాసు పలకడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు కలెక్టర్ వైఖరిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన కలెక్టర్‌‌‌ను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించేలా చూడాలన్నారు. దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్న బీజేపీ

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గురువారం కలెక్టర్ తీరుపై స్పందించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన కలెక్టర్‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కలెక్టర్‌కు కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే బీజేపీ పార్టీ సైతం 24 గంటల సమయం ఇచ్చింది. నేరుగా కలెక్టర్ రైతులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే జిల్లా రైతులు, బీజేపీ నాయకులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది. మరి బీజేపీ అయినా కలెక్టరేట్‌ను ముట్టడిస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తోక ముడుస్తుందో చూడాలి.

Tags:    

Similar News