అధికారులు వర్సెస్ ఆదివాసీల వివాదం ఇంకెంతకాలం.. ?
దిశ, భద్రాచలం : చర్ల రైస్‌పేట చెక్కులో 53వ సర్వే నంబర్ రెవిన్యూ వర్సెస్ ఆదివాసీల వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ సర్వేనంబర్‌తో 2007లో అప్పటి రెవిన్యూ అధికారులు విజయకాలనీకి చెందిన 28 నిరుపేద గిరిజన కుటుంబాలను ఎంపికచేసి 13.47 ఎకరాల భూమి పంపిణీచేస్తూ పట్టాలు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి కొంచెం అటుఇటుగా అర ఎకరం వంతున భూమి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి (కాంగ్రెస్) ప్రభుత్వ హయాంలో అసైన్‌మెంట్ పట్టాలు పొందిన విజయకాలనీ ఆదివాసీలు ఆనాటి […]
దిశ, భద్రాచలం : చర్ల రైస్‌పేట చెక్కులో 53వ సర్వే నంబర్ రెవిన్యూ వర్సెస్ ఆదివాసీల వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ సర్వేనంబర్‌తో 2007లో అప్పటి రెవిన్యూ అధికారులు విజయకాలనీకి చెందిన 28 నిరుపేద గిరిజన కుటుంబాలను ఎంపికచేసి 13.47 ఎకరాల భూమి పంపిణీచేస్తూ పట్టాలు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి కొంచెం అటుఇటుగా అర ఎకరం వంతున భూమి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి (కాంగ్రెస్) ప్రభుత్వ హయాంలో అసైన్‌మెంట్ పట్టాలు పొందిన విజయకాలనీ ఆదివాసీలు ఆనాటి నుంచి నేటి వరకు ఆ భూమిలోనే ఉన్నారు. చెట్టుపుట్టలు కొట్టి బాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆదివాసీ రైతులు వ్యవసాయ రుణాలు పొందారు. ఆ మేరకు రైతుబంధు సహాయం కూడా ఆదివాసీలు క్రమం తప్పకుండా అందుకుంటున్నారు.
ఏకలవ్యకి కేటాయింపు.. అడ్డుకున్న గిరిజనులు
గత 15 ఏళ్ళుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని చెప్పాపెట్టకుండా అధికారులు ఏకలవ్య పాఠశాలకు కేటాయించడంపై ఆదివాసీలు ఆగ్రహిస్తున్నారు. తమకు పట్టాలు ఇచ్చిన రెవిన్యూ అధికారులే ఇపుడు ఆ భూమిని ఏకలవ్యకి కేటాయించడం ఏమిటని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. పొజీషన్‌లో ఎవరు ఉన్నారనేది కూడా ఆరా తీయకుండా ఏకపక్షంగా ఏకలవ్యకి కేటాయించి తమకు అన్యాయం చేయడమేంటని నిలదీస్తున్నారు. సర్వే నంబర్ తప్పు అని చెబుతున్న రెవిన్యూ అధికారులు ఇప్పటికైనా ఆ తప్పు (రికార్డు) సరిదిద్దుకోవాల్సిందిపోయి పేదలమైన తమ పొట్టగొట్టే పనిచేయడం ఎంతవరకు సమంజసమని విజయకాలనీ ఆదివాసీలు అడుగుతున్నారు. ఇది తప్ప చర్లలో ప్రభుత్వ భూమి లేదా ? తమ పక్కనే ఖాళీగా ఉన్న భూమిని హడావుడిగా రెవిన్యూ అధికారులు పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించడంలో ఆంతర్యం ఏమిటి ? ఆ భూమిని ఎందుకు ఏకలవ్య పాఠశాలకి కేటాయించడంలేదని నిలదీస్తున్నారు. తమ భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు. కొందరు రాజకీయ పెద్దలు తెరవెనుక ఉండి ఏకలవ్యకి తాము వ్యతిరేకం అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తూ సోదర ఆదివాసీ సంఘాల నాయకులను తమపైకి పురిగొల్పి పంపడంలో ఆంతర్యం ఏంటని విజయకాలనీ ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. పట్టాలు పొందిన తమ భూమిని ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఆదివాసీ పెద్దలారా..! ఆలోచించండి
మా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. సాగునీటి సౌకర్యంలేక పైర్లు వేయకపోవచ్చు. కానీ భూమిపై పొజిషన్‌లో మేమే ఉన్నాం. సర్వే నంబర్ తప్పు అనే వంకతో ఆ భూమి నుంచి తమను వెళ్ళగొట్టడానికి కుట్ర జరుగుతోంది. సర్వే నంబర్ సరిచేయించి మా భూములు మాకు దక్కేలా చేయాల్సిన మా నాయకులైన మీరు ఇలాంటి కష్టకాలంలో మాకు అండగా నిలవాల్సిందిపోయి మా పొట్టగొట్టే వారిని సపోర్టు చేయడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. ఒకవేళ మా భూమి ఏకలవ్య పాఠశాలకు యోగ్యమని భావిస్తే మీరే ముందుండి మా అందరికీ అసైన్‌మెంట్ చట్ట ప్రకారం మరోచోట భూమి ఇప్పించి ఈ భూమిని ఏకలవ్యకి అప్పగించండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తమ చేతుల్లో పట్టాలు ఉన్నా దౌర్జన్యంగా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకునే రెవిన్యూ వారి చర్యలకు అడ్డుపడండి. ఆపద వస్తే ఆదివాసీలకు అండగా నిలిచే ఆదివాసీ నాయకులుగా మీ సత్తా చూపండని విజయకాలనీ ఆదివాసీలు మీడియా ముఖంగా వేడుకొంటున్నారు.
అన్నివర్గాలు సహకరించాలని ఆదివాసీల విన్నపం
చెట్టుపుట్టలు కొట్టి భూమి బాగుచేసుకున్నది పచ్చి నిజం. ప్రభుత్వం దానికి పట్టాలు ఇచ్చింది యదార్థం. ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్ళగొట్టే ప్రయత్నాలు దారుణం. భూమికి భూమి ఇస్తే వెళ్ళిపోవడానికి సిద్ధమే. కనుక నిరుపేదలమైన తమకు అన్యాయం జరుగకుండా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్నివర్గాల ప్రజలు అండగా నిలిచి న్యాయం చేయాలని విజయకాలనీ ఆదివాసీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏకలవ్య పాఠశాల కట్టకుండా తాము అడ్డుపడుతున్నామనేది గిట్టనివారు చేస్తున్న దుష్పచారమని ఆదివాసీలు తెలిపారు. చర్లలో ప్రభుత్వ స్థలంలోనే ఏకలవ్య పాఠశాల కట్టాలని తాము కూడా కోరుతున్నామని ఆదివాసీలు మీడియాకి తెలిపారు.
తప్పుడు సర్వేనంబర్ నమోదుచేసిన వారిపై చర్యలు చేపట్టాలి
భూపంపిణీ సమయంలో తమకు ఇచ్చిన పట్టాల్లో తప్పుడు సర్వేనంబర్ నమోదుచేసిన అప్పటి రెవిన్యూ అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బాధిత విజయకాలనీ గ్రామ ఆదివాసీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ యంత్రాంగ తప్పిదం వల్లనే భూవివాదం పుట్టుకొచ్చిందని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఆనాడు తమకు భూమి కొలిచి అప్పగించిన సమయంలోనే మ్యాప్ ప్రకారం చెక్‌చేసి ఉంటే ఇపుడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదని ఆదివాసీలు తెలిపారు. ముమ్మాటికీ ఇది రెవిన్యూ శాఖ తప్పిదం కనుక ఇపుడు సరిచేయాల్సింది కూడా వారే అని ఆదివాసీలు చెబుతున్నారు.
కలెక్టర్ జోక్యంతోనే సమస్య పరిష్కారం
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప రైస్‌పేట కాలనీ భూసమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ఇక్కడ నెలకొన్న భూవివాదం వలన ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణం జాప్యంమవుతోంది. దీంతో చర్ల, పరిసర మండలాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. భూమికి భూమి చూపిస్తే తప్ప ఇక్కడ నుంచి వైదొలగే ప్రసక్తిలేదని, అధికారులు కేసులుపెట్టినా జైలుకి పోవడానికి సిద్ధమే అని విజయకాలనీ ఆదివాసీలు ఘంటాపథంగా చెబుతున్నారు. మరోచోట భూమి ఇచ్చినా అంగీకారమే అని ఆదివాసీలు చెబుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.