ఎన్నిక జరిగేనా.. స్వతంత్ర అభ్యర్థిపైనే స్థానిక సంస్థల సభ్యుల ఆశ!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా? అనే అనుమానాలు స్థానిక సంస్థల సభ్యుల్లో అందోళన నెలకొంది. 820 మంది ఓటర్లు ఉన్న నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం జనవరి 4తో ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 9న ఎలక్షన్ గెజిట్ రాగా, 16 నుంచి నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభం అయింది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో పోటీ చేసిన అభ్యర్థుల […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా? అనే అనుమానాలు స్థానిక సంస్థల సభ్యుల్లో అందోళన నెలకొంది. 820 మంది ఓటర్లు ఉన్న నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం జనవరి 4తో ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 9న ఎలక్షన్ గెజిట్ రాగా, 16 నుంచి నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభం అయింది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఓటర్లకు దిగులు పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే ఎన్నికలు జరిగితేనే తమకు తాయిలాలు అందుతాయి, క్యాంపు రాజకీయాలు ఉంటాయని వారు ఎన్నికలు జరుగాలని కోరుకుంటున్నారు. మంగళవారం ఉదయం ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల బరిలో ఉండటం లేదని ప్రకటించడంతో వారిలో నిరాశ నెలకొంది. అయితే, ఎంపీటీసీల ఫోరం తరుపున స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ పోటీ చేయడంతో ఆశలు సజీవంగా నిలిచాయి.
2020లో జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్థానిక సంస్థల సభ్యులకు కాసులు కురిపించాయి. దానికి తోడు క్యాంపు రాజకీయాలు జరుగడం వారికి కలిసొచ్చింది. నాడు ఎమ్మెల్సీగా కవిత పోటీ చేయడం అప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు వందకు పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందో అన్న అనుమానంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. పార్టీలో చేరిన వారికి పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చారు. అదే సమయంలో కొవిడ్ ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. రెండుమార్లు క్యాంప్ రాజకీయాలు జరుగడంతో పాటు రెండు దఫాలుగా తాయిలాలు అందాయి. నాడు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత బంపర్ మెజార్టీతో గెలిచి ప్రతిపక్షాలకు డిపాజిట్ లేకుండా చేసింది. నాడు గెలుపుతో అధికార పార్టీ ఆనందం, ఓట్లు వేసిన లోకల్ బాడీ సభ్యులు ఆనందంగా ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో మరో ఆరేండ్ల పదవీ కోసం ఎన్నికలు జరుగుతాయని, తమకు కొద్దో, గొప్పో మేలు జరుగుతుందని ఆశించిన స్థానిక సంస్థల సభ్యులకు ప్రస్తుతం పోటీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం మొదలైంది. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ పరిశీలనలో నెగ్గుతుందా, విత్ డ్రా చేసుకోకుండా నిలబడుతారా? అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. పోటీ జరిగితే తమ ఓటును బట్టి ఎంతో కొంత వస్తుందని ఇప్పటికీ సభ్యులు నమ్ముతున్నారు. స్థానిక సంస్థలకు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 24న నామినేషన్ల పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావద్దని, 26న నామినేషన్ విత్ డ్రా చేసుకోవద్దని మరికొంత మంది కోరుతున్నారు. తద్వారా కొంతలో కొంతైనా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారు.