నష్టాల్లో ఆర్టీసీ.. కష్టాల్లో కార్మికులు.. వేతన సవరణ సంగతేంటి..?

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులు కష్టాల్లో పడుతున్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకటనకే పరిమితమైంది. ఇప్పటికే వేతన సవరణ జరగాల్సి ఉండగా.. దానిపై ప్రతిపాదనలే లేవు. మళ్లీ వేతన సవరణ సమయం దగ్గర పడుతోంది. మరో వైపు సిబ్బంది జీతాల పెంపు వ్యవహారం ఆర్టీసీలో రగడకు దారితీస్తోంది. ఈ అంశంపై అధికారులు, ఉద్యోగులు పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నారు. వేతనాలను పెంచితే ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ […]

Update: 2021-02-18 13:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులు కష్టాల్లో పడుతున్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకటనకే పరిమితమైంది. ఇప్పటికే వేతన సవరణ జరగాల్సి ఉండగా.. దానిపై ప్రతిపాదనలే లేవు. మళ్లీ వేతన సవరణ సమయం దగ్గర పడుతోంది. మరో వైపు సిబ్బంది జీతాల పెంపు వ్యవహారం ఆర్టీసీలో రగడకు దారితీస్తోంది. ఈ అంశంపై అధికారులు, ఉద్యోగులు పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నారు. వేతనాలను పెంచితే ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ అధికారులు సీఎంకు నివేదించిన విషయం తెలిసిందే. ఈ విషయం వివాదంగా మారింది.

ఎలా మరి?

ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం మేర జీతభత్యాలకే అవుతోంది. అయితే జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మునుగడైనా కష్టమన్నది ఆర్థిక నిపుణుల సూచన. అలాంటిది ఆర్టీసీ జీతభత్యాల వ్యయం సగానికి మించిపోయిన తరుణంలో అందుకు అనుగుణంగా ఆదాయం పెంచుకోక తప్పదని ఆర్టీసీ యాజమాన్యం నివేదించింది. ప్రత్యామ్నాయ ఆదాయం మార్గాలు లేకపోవడంతో చార్జీల పెంపు ఒక్కటే పరిష్కారమని సూచించింది. లేనిపక్షంలో బడ్జెట్‌ రూపంలో వెయ్యి కోట్లు ప్రభుత్వం నుంచి సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవంగా 2017 ఏప్రిల్‌ నుంచి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగాలి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాలి.

కానీ నష్టాలతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో వేతన సవరణ పెండింగ్‌లో ఉంది. అలాగే 2021 ఏప్రిల్‌ నుంచి కొత్త వేతన సవరణ జరగాలి. కానీ ఇంతవరకు ఏ గుర్తింపు పొందిన కార్మిక సంఘంతోనూ కనీసం చర్చలూ జరపలేదు. 50 నుంచి 60 శాతం ఫిట్‌మెంట్‌ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాన్ని ఎటూ తేల్చలేదు. అయితే ఆర్టీసీ 2018 జులై 1 నుంచి 16 శాతం మధ్యంతర భృతి ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచి.. చార్జీలు పెంచకపోయినా, ప్రభుత్వం సాయం అందకపోయినా.. సంస్థ నిలదొక్కుకోవడం కష్టమంటూ అధికారులు నివేదిస్తున్నారు. దీనిని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణతో పాటు.. 2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణను ఒకేసారి అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

బేసిక్‌లో వ్యత్యాసాలు

ఆర్టీసీలో జీతాల విషయంలో ఉన్నతాధికారులకు, ఇతర సిబ్బందికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వారి బేసిక్‌లో అంతరం ఎక్కువ ఉందని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీలో మొత్తం ఐదుగురు ఈడీలు ఉన్నారు. ఒక్కొక్క ఈడీకి కనీసంగా నెల వేతనం రెండున్నర లక్షలుగా ఉందని, ఆ స్థాయి నుంచి మొదలుపెడితే.. డీఎంల వరకు భారీగానే జీతాలు పొందుతున్నారని చెబుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికుల బేసిక్‌ చాలా తక్కువ ఉందని వివరిస్తున్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే… ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ బేసిక్ పే రూ.21,390 ఉంటే టీఎస్ ఆర్టీసీలో రూ.18,780 ఉంది. ఇదే తరహాలో కండక్టర్ బేసిక్ పే ఏపీఎస్ ఆర్టీసీలో రూ.19,580 ఉంటే టీఎస్ ఆర్టీసీలో మాత్రం రూ.12,610లు. అదే సింగరేణి సంస్థలో డ్రైవర్ బేసిక్ పే రూ.29,440, ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ బేసిక్ పే రూ.20,180 లుగా ఉంటోంది. ఇవన్నీ దాచి పెడుతూ సంస్థ నష్టాలకు కార్మికులే కారణమని అధికారులు సీఎంకు చెప్పారనే విమర్శలున్నాయి. కేవలం సీఎం దగ్గర మెప్పు పొందేందుకే ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు మండిపడుతున్నారు.

ఫించన్లూ ఇవ్వడం లేదు

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మర్చిపోయారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. ఇది కార్మిక లోకం గుర్తిస్తోంది. రెండేండ్ల కింద రిటైర్మెంట్​అయిన వారికి ఇంకా పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. వారికి రిటైర్మెంట్ సెటిల్​చేయలేదు. ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా ప్లాన్ ప్రకారం కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్​పరం చేసేందుకు ప్లాన్​వేస్తున్నారు. సెట్విన్​సర్వీసులను ఎందుకు పెంచుతున్నారు? దీనిపై టీఎంయూ పోరాటం చేస్తోంది. పని చేయించుకున్నప్పుడు జీతాలు కూడా సరిగా ఇవ్వరా? పని చేసి ఫలితం అడిగే హక్కు మాకుంది. అందుకే ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. – అశ్వత్థామరెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి

వేతన సవరణ చేయాలి

ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలి. ఇప్పటికే చాలా ఏండ్లు కాలం వెళ్లదీశారు. ఎప్పుడు ఫిట్‌మెంట్ ప్రకటిస్తారో తెలియడం లేదు. కార్మికుల రక్షణ కోసం ఉద్యమిస్తాం. కార్మిక శాఖ కమిషనర్ ఉన్నాడో…లేడో కూడా తెలియదు. కార్మికులు కష్టాలు పడుతుంటే ఏం చేస్తున్నారు? 2017 నుంచి వేతన సవరణపై సాగదీస్తున్నారు. ఈ ఏప్రిల్ వరకు వేతన సవరణ చేయాల్సిందే. దీనిపై ఎంప్లాయిస్ యూనియన్​ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతున్నాం. – రాజిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్​ప్రధాన కార్యదర్శి

Tags:    

Similar News