మద్యం టెండర్లకు పోటీ.. నేడే ఆఖరు

దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం దుకాణాలకు దరఖాస్తుల వరద పారుతోంది. ఒక్కో దుకాణానికి సగటున 10 నుంచి 14 చొప్పున పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. అప్లికేషన్లకు గురువారం ఆఖరి రోజు కావడంతో.. భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. రద్దీని ముందుగానే అంచనా వేస్తున్న ఆబ్కారీ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్​ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక కౌంటర్లను రెడీ చేశారు. రెండు రోజుల కిందట వరకు నామమాత్రంగా […]

Update: 2021-11-17 19:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం దుకాణాలకు దరఖాస్తుల వరద పారుతోంది. ఒక్కో దుకాణానికి సగటున 10 నుంచి 14 చొప్పున పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. అప్లికేషన్లకు గురువారం ఆఖరి రోజు కావడంతో.. భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. రద్దీని ముందుగానే అంచనా వేస్తున్న ఆబ్కారీ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్​ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక కౌంటర్లను రెడీ చేశారు. రెండు రోజుల కిందట వరకు నామమాత్రంగా వచ్చినా.. ఈ చివరి రెండు రోజుల్లో రద్దీ పెరిగింది. లక్కీడ్రాకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో మరింత మంది బరిలోకి దిగే అవకాశం ఉంది. గత వేలంలో కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేండ్లలో ఎన్నికల హడావిడి మొదలుకానున్న నేపథ్యంలో ఈసారి మద్యం దుకాణాలకు పోటీ పెరుగుతోంది. దీనికితోడుగా అమ్మకాలపై కమీషన్​ కూడా పెంచడం, పర్మిట్​రూంల ఏర్పాటు తదితర కారణాలతో దుకాణాలకు దరఖాస్తులు పెరుగుతున్నాయి.

శివార్లలో ఎక్కువే..

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా నగర శివార్లలోని దుకాణాలకు టెండర్లు ఎక్కువగా దాఖలవుతున్నాయని అధికారులు చెప్పారు. రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో పాటు నగరానికి నాలుగు వైపులా రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా పుంజుకోవడం, శివార్లలో వందల కొద్దీ కొత్త కాలనీలు విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలకు సైతం గిరాకీ పెరుగుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల వైన్​ షాపులను సైతం కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఎక్కువ మంది వ్యాపారులు నగర శివార్లలోనే మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆసక్తి చూపడం గమనార్హం.

28 వేలు దాటిన దరఖాస్తులు

రాష్ట్రంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే మద్యం దుకాణాలకు 28 వేల దరఖాస్తులు దాఖలైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 వరకు 6,600 అప్లికేషన్లు రాగా.. ఆ తర్వాత రెండు రోజుల్లో 28 వేలు వచ్చాయంటున్నారు. గురువారం ఆఖరి రోజు కావడంతో మరో 10 వేల అప్లికేషన్స్​వచ్చే చాన్స్​ఉంది. దీంతో ఈసారి అప్లికేషన్స్​ఫీజు ద్వారానే ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం దాటనుంది.

Tags:    

Similar News