ప్రజాప్రతినిధులు వర్సెస్ అధికారులు
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ మహా నగర పాలక సంస్థలో అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు అన్నట్లుగా తయారైంది. పాలకులు తమ తప్పిదాలను అధికారుల మీదకు నెట్టేయాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూల్చివేతల విషయాన్ని అధికారుల మీదకు నెట్టేయాలని బహిరంగంగా అన్నారు. గతంలోనూ అధికారులే అన్ని తప్పులు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఇలా లీడర్లు తమను ప్రజల్లో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండడంపై అధికారులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం […]
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ మహా నగర పాలక సంస్థలో అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు అన్నట్లుగా తయారైంది. పాలకులు తమ తప్పిదాలను అధికారుల మీదకు నెట్టేయాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూల్చివేతల విషయాన్ని అధికారుల మీదకు నెట్టేయాలని బహిరంగంగా అన్నారు. గతంలోనూ అధికారులే అన్ని తప్పులు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఇలా లీడర్లు తమను ప్రజల్లో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండడంపై అధికారులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లను ఇబ్బందిపట్టే ప్రయత్నాలను కమిషనర్ అడ్డుకుంటుండడంతో ఇప్పుడు నేతలంతా కమిషనర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ కమిషనర్ మాత్రం అలసత్వం వహించే సిబ్బందిని హెచ్చరిస్తూనే, రాజకీయ నాయకుల వల్ల ఇబ్బంది పడుతున్న అధికారులను కాపాడుతోంది.
కమిషనర్లపై ఒత్తిళ్లు..
2014–15 సమయంలో వరంగల్ మహా నగర అభివృద్ధి కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు పూనుకుంది. ఈ క్రమంలో బల్దియా కమిషనర్.. కుడా వైస్ చైర్మన్‌గా వ్యవహరించిన, అప్పటి మున్సిపల్ కమిషనర్ గౌతమ్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ రూపొందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కుడా చైర్మన్‌తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. ఫలితంగా కొద్ది రోజులకు ఆయన బదిలీ అయ్యారు. కమిషనర్ గౌతమ్ తర్వాత జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వచ్చేందుకు ఐఏఎస్‌లు ఆసక్తి చూపకపోవడంతో డిప్యుటేషన్‌పై రవి కిరణ్‌ను కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన సైతం అయిష్టంగానే కమిషనర్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం తిరగకుండానే బదిలీపై వెళ్లిపోయారు.
కార్పొరేటర్లే హాజరు కావాలి..
ప్రస్తుత కమిషనర్ మొదట్లో రాజకీయ నాయకుల పట్ల దూకుడుగానే వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశాలకు మహిళా కార్పొరేటర్ల భర్తలు హాజరు కావడంపై సభ వేదికపై నుంచే ఘాటుగా స్పందించారు. తన బదులు తన భర్త కమిషనర్‌గా వ్యవహరిస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. విధిగా మహిళా కార్పొరేటర్లు సభకు మాజరయ్యేలా చూస్తూ ప్రజాప్రతినిధుల భర్తల జోక్యాన్ని తగ్గించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలకు కూడా ఆమె వెనుకాడలేదు. కానీ ఇటీవల ఆరు నెలల నుంచి కమిషనర్‌పైనా ఒత్తిళ్లు వస్తున్నాయి. తమకు నచ్చని వారు చెబితే వినని అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ కార్పొరేటర్లు ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాకుండా అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల కాంట్రాక్టు విషయంలోనూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నగరం నీట మునిగింది. దీంతో ప్రభుత్వం నాలా కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. కమిషనర్ సైతం నాలా ఆక్రమణ విషయంలో దూకుడుగా ముందుకెళ్తూ దాదాపు 80 శాతం అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా చూశారు. అయితే ఇటీవల కార్పొరేషన్‌కు చెందిన 8వ డివిజన్ కార్పొరేటర్ ఇంటిని బల్దియా సిబ్బంది కూల్చివేశారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు కూల్చివేతను ఆపాలని ఒత్తిడి తెచ్చారు. కానీ కమిషనర్ వినలేదు. గతంలోనూ అధికారులను బదిలీ చేయాలని కమిషనర్‌ను ఓ ఎమ్మెల్యేనే కౌన్సిల్ సమావేశంలోనే చెప్పారు.
అధికారులపై నెట్టేయండి..
అక్టోబర్ 23న బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. నాలాల ఆక్రమణల తొలగింపును అధికారులపై నెట్టేయాలని ప్రజాప్రతినిధులను సమావేశంలోనే సూచించారు. కార్పొరేషన్‌లో నిధులున్నా అధికారులు పనులు చేయడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేని రూరల్ జిల్లాకు చెందిన నేత ఒకరు, అర్బన్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అధికారులను దోషులుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు.
బిల్లులు మంజూరు చేయట్లే..
గతంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విలీన గ్రామాల ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పని చేసినా కార్పొరేషన్ అధికారులు బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ల కాళ్లు పట్టుకున్నా పనులు చేయడం లేదని సంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనిని సక్రమంగా పూర్తి చేయని పక్షంలోనే బిల్లులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు బదులిచ్చారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సైతం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల తీరును చాలా సందర్భాల్లో తప్పు పట్టారు. ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రజాప్రతినిధులు వారి వైఫల్యాలను తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు వాపోతున్నారు.