బద్వేలులో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉపఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెజారిటీ సాధనయే లక్ష్యంగా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బద్వేలులో తిష్ట వేశారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుంటే మరికొందరు ఆయా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉపఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెజారిటీ సాధనయే లక్ష్యంగా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బద్వేలులో తిష్ట వేశారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుంటే మరికొందరు ఆయా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తారని అంతా ప్రచారం జరిగింది. అయితే కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో జగన్ సభ నిర్వహించలేకపోతున్నారు. దీంతో సీఎం జగన్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు లేఖలు రాశారు. తన అభివృద్ధిని చూసి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఉపఎన్నిక సందర్భంగా ‘నా కుటుంబ సభ్యులైన మీతో బద్వేలు వచ్చి గడపాలని, ప్రత్యక్షంగా మిమ్మల్ని బహిరంగసభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కమిషన్ నిబంధనల నేపథ్యంలో నేను ప్రత్యక్షంగా బద్వేలుకు రాలేకపోతున్నా. మిమ్మల్ని అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నా. నేను ప్రత్యక్షంగా అక్కడికి వస్తే..భారీగా మన అక్కచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరికైనా కొవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకునే నా పర్యటనను రద్దు చేసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నా భావాలను మీతో ప్రత్యక్షంగా పంచుకునేందుకు వీలుగా ఈ ఉత్తరం రాస్తున్నాను అంటూ ప్రతీ ఇంటికి సీఎం జగన్ లేఖ రాశారు.
ప్రతీ ఇంట్లోని అవసరమే ప్రభుత్వ అజెండాగా పాలన
‘నా కుటుంబ సభ్యులైన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అవ్వాతాతలకు.. మీ ఇంటిలోని వారికి వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా) పథకాలు అందాయని తెలిసి సంతోషించాను. ప్రతి ఇంట్లో ప్రతి అవసరాన్ని మన అజెండాగా మార్చుకుని పాలన చేస్తున్నాం. మీ అవసరాలు తెలుసుకుని ఎన్నికల్లో వాగ్ధానం చేసినవే కాకుండా ఎన్నికల్లో వాగ్ధానం చేయని కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం. మనందరి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీదే ఓటు వేసి మన అభ్యర్థి దాసరి సుధను తిరుగులేని మెజార్టీతో అఖండ విజయం అందించాలని సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను. 2019లో జరిగిన ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి దాసరి సుధని, డాక్టరమ్మను మన అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో వెంకట సుబ్బయ్యకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో దాసరి సుధ గారిని గెలిపించాలని.. పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరుకుంటున్నాను’
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం
‘రాష్ట్రంలో 18.70 లక్షల రైతులకు రూ.18 వేల కోట్లతో పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతు భరోసా కింద ప్రతీ ఏడాది రూ. 13,500కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ 29 నెలల కాలంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అక్షరాలా 31.07 లక్షల రైతులకు రూ. 3,788 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల రైతులకు మరో రూ. 1261 కోట్లు ఖర్చు చేశాం. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిల్ని, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 9,000 కోట్ల విద్యుత్ బకాయిల్ని, గత ప్రభుత్వం వదిలేసిన రూ. 384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా మనమే చిరునవ్వుతోనే మోశాం. రెండున్నరేళ్లలో 13 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించి…500కు పైగా సేవలతో ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు ద్వారా పౌర సేవల్లో దేశంలోనే సరికొత్త విప్లవం తీసుకువచ్చాం. 1వ తేదీ సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపుతట్టి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.7 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ కేవలం మనకే సొంతం’
మన పిల్లల చదువుకు భరోసా కల్పిస్తున్నాం
‘ఈరోజు బడిలో ఉన్న ప్రతి పాప, ప్రతి బాబు..ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ లేదా ప్రొఫెషనల్ విద్యను ఒక హక్కుగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. గవర్నమెంటు స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాం. జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు కుట్టుకూలీతోసహా మూడు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగు, బైలింగ్యువల్ టెక్స్‌బుక్స్, నోట్ బుక్స్, వర్క్‌బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు వీటితోపాటు డిక్షనరీ…ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నాం. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగన్న విద్యాదీవెన వంటి కీలక పథకాలను అందిస్తున్నాం’
అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం
‘వైఎస్సార్–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లో… నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం ఖచ్చితంగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా ఏకంగా చట్టం చేశాం. అక్కచెల్లెమ్మల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ దిశ బిల్లు, దిశ పోలీసుస్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేశాం. వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా రూ. 905 కోట్లు రెండు విడతలుగా అందించాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తామన్న మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే 95 శాతం వాగ్ధానాలు అమలు చేసిన పాలన మనది. మీ అందరి ఆశీస్సులతో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మంచి చేసిన ప్రభుత్వం మనది. మరింతగా మీ అందరికీ మంచి చేసేందుకు దేవుని దయ, మీ చల్లని దీవెనలు కోరుతున్నాను. బద్వేలు ఉప ఎన్నికలో మన పార్టీ నిలబెట్టిన దాసరి సుధమ్మకు తిరుగులేని మద్దతు పలకాలని అభ్యర్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో నా చెల్లెమ్మను గెలిపించాలని సవినయంగా కోరుతున్నాను’ అంటూ సీఎం జగన్ లేఖలో బద్వేలు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.