రైతులకు సీఎం ‘తీపి’ కబురు
దిశ, వెబ్ డెస్క్: జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదలందరికీ ఇళ్లు పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా, అదే రోజు చెరకు రైతులకు మరో తీపి కబురు అందించనున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సహకార షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన […]
దిశ, వెబ్ డెస్క్: జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదలందరికీ ఇళ్లు పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా, అదే రోజు చెరకు రైతులకు మరో తీపి కబురు అందించనున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సహకార షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకూ వినియోగించగలమో ఆలోచించాలని చెప్పారు. టీటీడీతో పాటు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచన చేయాలన్నారు. దీని వల్ల కాస్తయినా సహకార చక్కెర ఫ్యాక్టరీలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులకు బకాయిలు లేకుండా తీర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని చెప్పారు. చెరకు రైతులకు రూ.54.6 కోట్లు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని, అది కూడా జూలై 8న చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. దాదాపు 15 వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
శ్రీ విజయరామ గజపతి ఫ్యాక్టరీ కింద రూ.8.41 కోట్లు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కింద రూ.10.56 కోట్లు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.8.88 కోట్లతో పాటు, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.4.63 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలపై మరింత లోతుగా ఆలోచన చేసి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేయాలని మంత్రుల బృందం, అధికారులకు సీఎం ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి వాటన్నింటిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని సూచించారు.