చిన్న ప్రమాదమే అనుకున్నా, కానీ.. కుమారుడికి జరిగిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై స్పందించారు. ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కుమారుడి ఆరోగ్యం (Son's Health)పై పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని అరకు పర్యటన (Araku Tour)లో ఉన్నప్పుడు తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. మొదట చిన్న ప్రమాదమే అనుకున్నానని, కానీ ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని పవన్ అన్నారు. సమ్మర్ క్యాంపు (Summer Camp) కోసం మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ (Singapur) వెళ్లాడని, ప్రమాదం జరగడం దురదృష్ణకరమని, ఈ ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోవడం బాధాకరమని అన్నారు.
మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు తెలిసిందని చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) ఫోన్ చేసి ఆరా తీశారని, సింగపూర్ లోని ఇండియన్ హైకమిషనర్‌కు కూడా సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా స్పందించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన కుమారుడి ఆరోగ్యం బాగుండాలని పూజలు నిర్వహించిన కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అకీరా పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరమని, అగ్నిప్రమాదం ద్వారా వెలువడిన పొగ పీల్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని, మార్క్ శంకర్ కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. రేపు ఉదయానికి ఆరోగ్యంపై స్పష్టత వస్తుందని, ప్రస్తుతం తాను కూడా సింగపూర్ వెళుతున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.