మతం పేరుతో చిచ్చులు పెట్టి, చలి కాచుకుంటోంది.. బీజేపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మతం పేరుతో దేశంలో చిచ్చులు పెడుతోందని, ఆ మంటల్లో చలి కాచుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS Sharmila) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ మతం పేరుతో దేశంలో చిచ్చులు పెడుతోందని, ఆ మంటల్లో చలి కాచుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS Sharmila) అన్నారు. గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) లో ఏఐసీసీ సమావేశం (AICC Meeting) జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ దేశానికి ఎంతో అవసరమని, పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వక్ఫ్ బిల్లు (Wakf Bill)ను బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించిందని, మైనారిటీల మనోభావాలు దెబ్బతీసి.. మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు- పాలించు సిద్దాంతం ఒక్కటేనని, మతం పేరుతో, కులం పేరుతో దేశంలో మంటలు పెట్టీ, ఆ మంటల్లో చలి కాచుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ సొంత అవసరాలకు వాడుకుంటుందని, చివరికి ఎన్నికల సంఘాన్ని (Election Commission) సైతం నడిపిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అంతేగాక ఈ దేశ సంపదను అదానీ (Adani), అంబానీ (Ambani)కి దోచిపెడుతుందని, బీజేపీ దోపిడి అరికట్టాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని, దేశ ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నినదించారు. నాడు కాంగ్రెస్ నాటిన చెట్ల ఫలాలను నేడు బీజేపీ దుర్వినియోగం చేస్తుందని, ఏపీలో పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ (Sonia Gandhi), సోనియా గాంధీ (Rahul Gandhi) వంటి అగ్రనేతలను ఆహ్వానిస్తున్నామని, నిత్యం విరివిగా భారీ కార్యక్రమాలు ఉండేలా కసరత్తు చేస్తున్నామని షర్మిల వెల్లడించారు.