పోలవరం ముంపు ప్రాంతాలపై జాయింట్ సర్వేకు ముందడుగు
పోలవరం ముంపు ప్రాంతంపై జాయింట్ సర్వే కోసం ఎట్టకేలకు ఏపీ సర్కార్ అంగీకరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం ముంపు ప్రాంతంపై జాయింట్ సర్వే కోసం ఎట్టకేలకు ఏపీ సర్కార్ అంగీకరించింది. దీంతో ముంపు ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల అధికారులు జాయింట్ సర్వే నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయింది. ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీకి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఈ భేటీకి హాజరయ్యారు. పోలవరం పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు, ఇతర అంశాలపై చర్చించడంతోపాటు సర్వేపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశం, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం చూపే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రధానంగా చర్చించారు.
ఇరు రాష్ట్రాల జాయింట్ సర్వే
పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తించడానికి, సరిహద్దులు నిర్ణయించడానికి జాయింట్ సర్వే నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. ఇదే విషయాన్ని జనవరి 2023లో జరిగిన 2వ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సాంకేతిక సమావేశంలో, ఆగస్టు 2024లో నిర్వహించిన సమావేశంలోనూ చర్చకు వచ్చింది. కానీ ఏపీ అంగీకరించలేదు. తాజాగా.. ఒప్పుకోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టనున్నారు. భద్రాచలం, మణుగూరులో నీటి మట్టాలను ఇరు రాష్ట్రాల ప్రతినిధులు పరిశీలించనున్నారు. భద్రాచలంలోని నీటి మట్టాలు (8 అవుట్‌ఫాల్ రెగ్యులేటర్లు, చారిత్రక దేవాలయం), మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ వద్ద నీటి మట్టాలను పరిశీలించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆదేశించారు. అలాగే.. కిన్నెరసాని, ముర్రెడువాగులపై సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం ప్రాంతాల గుర్తించాలని సూచించారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా కిన్నెరసాని, ముర్రెడువాగు నదుల డ్రైనేజీలో ఏర్పడిన అడ్డంకికి సంబంధించి సీడబ్ల్యూసీ ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాలను గుర్తించనున్నారు. అలాగే.. సరిహద్దులు సైతం నిర్ణయించాలని ఆదేశించగా.. ఇందుకు రెండు రాష్ట్రాలు సైతం అంగీకరించాయి.
ఇతర స్థానిక వాగులపైనా సర్వే..
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురవుతున్న మరో 6 నుండి 7 పెద్ద స్థానిక వాగులపై కూడా ఇదే విధమైన సర్వే నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ సైతం అంగీకరించింది. అలాగే.. సమావేశంలో గోదావరి-కృష్ణా లింక్ ప్రాజెక్టు పైనా చర్చించారు. ఈ ప్రాజెక్ట్ కోసం గోదావరి నది నుండి మొత్తం 40,000 క్యూసెక్కుల నీటిని మళ్లించడానికి వీలుగా పోలవరం ప్రాజెక్ట్ కనెక్టివిటీని మరింత విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. ఇందుకోసం శాడిల్ డ్యామ్, హెడ్ రెగ్యులేటర్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్ మెరుగుదల, వెడల్పు, కొత్త నిర్మాణాలు చేపట్టడం, వెడల్పు చేసిన భాగాలకు లైనింగ్ చేయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ అభ్యంతరాలు..
అయితే.. తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని తాత్కాలిక పథకంగా ప్రారంభించి ఇప్పుడు శాశ్వతం చేయడాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎలాంటి విస్తరణలు లేదా టెండర్లు పిలవడం వంటి చర్యలు చేపట్టకూడదని తెలంగాణ స్పష్టం చేసింది. మరోవైపు అక్కడే అనధికారికంగా చేపట్టిన బనకచర్ల ఎత్తిపోతల పథకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 టీఎంసీల నీటిని తీసుకుంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి రివర్ బోర్డుకు, సీడబ్ల్యూసీకి సమర్పించలేదని తెలంగాణ తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే చాలా లేఖలు రాసిందని, పీపీఏ సమావేశాలలోనూ అభ్యంతరాలు తెలిపామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని పీపీఏ ఆదేశించిందని, డబ్ల్యూసీ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లవద్దని సూచించారని తెలంగాణ పేర్కొంది. సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతి పొందే వరకు ఏపీ అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని, పోలవరం అథారిటీ పర్యవేక్షించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.