‘అత్యాచార ఘటన కలచివేసింది.. బాధితురాలికి ఆర్థిక సాయం’

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌ మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తన మనసును ఎంతగానో కలచివేసిందని వ్యాఖ్యానించారు. మంగళవారం క్యాపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మహిళల భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తాను చాలా చింతిస్తున్నానన్నారు. మళ్లీ […]

Update: 2021-06-22 02:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌ మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తన మనసును ఎంతగానో కలచివేసిందని వ్యాఖ్యానించారు. మంగళవారం క్యాపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మహిళల భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తాను చాలా చింతిస్తున్నానన్నారు. మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని తానన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని జగన్ మహిళలకు హామీ ఇచ్చారు.

ఆర్థిక సాయం అందిస్తాం: హోంమంత్రి సుచరిత

నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేస్తోందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమైందన్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మేకతోటి సుచరిత ఇప్పటికే బాధితురాలిని పరామర్శించినట్లు తెలిపారు. మంగళవారం బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు పరిహారం అందజేస్తామని తెలిపారు. ఘటనలో పాల్గొన్నవారు ఎంతటివారైనా సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సీఎం జగన్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధికంగా ముందుకు రావడానికి వైస్సార్ చేయూత పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పాడి పరిశ్రమ, కిరాణా కొట్టు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. మహిళలకు నిజమైన సాధికారత చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో మహిళలకు చేతినిండా డబ్బులు అందిస్తున్నఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందని సుచరిత అన్నారు.

Tags:    

Similar News