సీఎం కేసీఆర్ యాదాద్రి టెంపుల్‌లో చేసిన పని ఇదే..!

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని సీఎం కేసీఆర్ అణువణువునా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పెద్దగుట్టపైన ఆలయనగరికి చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు […]

Update: 2021-03-04 13:51 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని సీఎం కేసీఆర్ అణువణువునా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పెద్దగుట్టపైన ఆలయనగరికి చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్​కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదాద్రి ఆలయంలో ఇంకా ఏయే పనులు అసంపూర్తిగా ఉన్నాయి..? అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా కన్పించేలా తీర్చి దిద్దాలని ఆదేశించారు. అధికారులను ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను తెలిపే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో అలంకరించాలన్నారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కోరారు.

కళాఖండాల్లో హడావిడి వద్దు

అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు చెప్పారు. అద్దాల మండపాన్ని అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా ఉండేల తీర్చి దిద్దాలన్నారు. అవసరమైతే చైనా దేశాన్ని సందర్శించి.. అక్కడ 7 కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను సీఎం కెసిఆర్ కోరారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు సూచనలిచ్చారు.

గెస్ట్‌హౌస్ లిఫ్టు పనులపై అసంతృప్తి..

యాదాద్రిలో గెస్ట్‌హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెల్లదీసుకునేలా.. దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గుడి కింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏసీ ప్లాంట్ గ్యాస్ గోదాములను, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను, కాలికనడక నిర్మాణ పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు.

దాదాపు పూర్తయినట్లే…

రూ. 12 వందల కోట్లతో ప్రారంభించిన పునర్నిర్మాణ పనులు 2016 అక్టోబరు 11న శ్రీకారం చుట్టగా… ఇప్పటివరకు సుమారు 850 కోట్లు వెచ్చించినట్లు యాడా తెలిపింది. ప్రధాన ఆలయం 4.33 ఎకరాల్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. మాడవీధుల్లోని సాలహారాల్లో విగ్రహాల పొందిక పనులు మినహా ప్రధానాలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. ఆలయ పడమర దిశలో వేంచేపు మండపం, తూర్పున బ్రహ్మోత్సవ మండపం, ఉత్తరాన రథశాల నిర్మించారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన 13.23 ఎకరాలతో 104 కోట్లతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్లలో… 15 విల్లాలకు గాను 14 పూర్తయ్యాయి. మరొకటి పురోగతిలో ఉంది. కొండ చుట్టూ 130 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బాహ్య వలయ రహదారి.. దక్షిణ దిశలో మినహాయించి మూడు వైపులా పూర్తి చేశారు. ప్రధాన ఆలయంలో విద్యుదీకరణతోపాటు ఏసీ సరఫరా, ఇతర సదుపాయాల కోసం పనులు జరగుతున్నాయి. ఇప్పటికే ఫ్లోరింగ్, డ్రైనేజీ పనులు పూర్తి కాగా… ఆలయ ఉత్తర దిశలో బస్సు ప్రాంగణం, వాహనాల పార్కింగ్ నిర్మాణం సాగుతోంది.

స్థానికులకే ఉద్యోగాలిచ్చే అవకాశం..

యాదాద్రి ఆలయ విస్తరణలో కోల్పోతున్న దుకాణదారులతో సీఎం చాలాసేపు మాట్లాడారు. వారు కోల్పోయిన దానికన్నా గొప్పగా వారికి అన్ని వసతులతో కూడిన విశాలమైన రీతిలో షోరూముల తరహాలో నూతన దుకాణాలను కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఉచిత ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో గుట్ట మీద వ్యాపారాలు చేసుకున్న వారికి టెంపుల్ టౌన్‌లో పాత పద్దతిలోనే దుకాణాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాన్ని సైతం పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఎ ప్రత్యేక అధికారి కిషన్ రావు, ఈవో గీత, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్‌సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి వేలు, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News