కేసీఆర్ సంచలన నిర్ణయం.. రెవెన్యూలో రిజిస్ట్రేషన్ల శాఖ విలీనం?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయంటూ ఆసక్తి నెలకొంది. మూడేండ్ల కష్టఫలంతో అత్యద్భుతమైన ‘ధరణి’ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్లను తహశీల్దార్లు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకే వారికే ప్లాట్ల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా అప్పగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ఇప్పటికే వ్యవసాయ భూముల […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయంటూ ఆసక్తి నెలకొంది. మూడేండ్ల కష్టఫలంతో అత్యద్భుతమైన ‘ధరణి’ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్లను తహశీల్దార్లు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకే వారికే ప్లాట్ల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా అప్పగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ఇప్పటికే వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. అదే క్రమంలో నివాస స్థలాల రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహశీల్దార్ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి రెవెన్యూ శాఖలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పనులతో పాటు ఉద్యోగులనూ వీలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఇన్ స్పెక్టర్ జనరల్ పోస్టును కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు కూడా అదే భావనను వ్యక్తం చేస్తున్నాయి. అంటే త్వరలోనే రెవెన్యూ శాఖలో విలీన ప్రక్రియ ఉండనుంది.
ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఐతే ఎప్పటి నుంచి ప్రారంభించాలి? వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఏం చేయాలి? అనే విషయాలు చర్చించడానికి సీఎం ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారని చెబుతున్నారు.దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇటీవల తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతం అయ్యిందని సీఎం కేసీఆర్ గుర్తించినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని నివేదికలు అందించినట్లు తెలిసింది. ఈ క్రమంలో నివాస స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టడంలో జాప్యానికి కారణం ఎవరన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
ధరణితో మేం సిద్ధం..
గడిచిన రెండు నెలలుగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు, అధికారులు ఖాళీగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. నిజానికి సాగు భూములతో పాటు వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువల నిర్ణారించడంలో నిమగ్నమయ్యారు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన ప్రతి ఆస్తికి విలువలను రూపొందించారు. సాగు భూముల మార్కెట్ ధరలను రెవెన్యూ శాఖకు అప్పగించడం ద్వారానే ధరణి పోర్టల్ లో నమోదు చేశారు. ఐతే వారి కారణంగానే జాప్యం జరిగిందన్న ప్రచారానికి తెర తీసేందుకు శనివారం రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఆ శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ శేషాద్రిని కలిశారు. తాము ప్రభుత్వ నిర్ణయం మేరకు ధరణి ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు షురూ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి బేషజాలు లేవని మొర పెట్టుకున్నారు. అధికారుల నుంచి ఆదేశాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. విజయవంతం చేసేందుకు తాము విద్యుక్త ధర్మంగా భుజస్కందాలపై వేసుకుంటామని ప్రతినబూనారు. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ టి.సుబ్బారావు నేతృత్వంలో ఉద్యోగ సంఘాల తరపున టీఎన్జీఓ ఎస్ఎం హుస్సేనీ, సబ్ రిజిస్ట్రేషన్ల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ సామల సహదేవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జే.హెచ్.ప్రణయ్ కుమార్, సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు స్థితప్రగ్న, ప్రధాన కార్యదర్శి సిరాజ్ అన్వర్ లు ఇన్ స్పెక్టర్ జనరల్ శేషాద్రిని కలిశారు.
ససేమిరా.. రెవెన్యూ..
దశాబ్దాలుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు వేర్వేరుగా పని చేశాయి. ఇటీవల సాగు భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించారు. ఇప్పుడేమో ఏకంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ లను కూడా అప్పగించి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖలో విలీనం చేయాలన్న ఆలోచనను ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ బాధ్యతలకు జిల్లా స్థాయిలో ఏ అధికారిని నియమించలేదు. రానున్న రోజుల్లో విలీనం చేస్తే ఆ శాఖ జిల్లా స్థాయి అధికారి తమపై పెత్తనం చెలాయించే అవకాశం ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఉన్న రెవెన్యూ శాఖ బాధ్యతలను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు వ్యవసాయేతర ఆస్తుల బాధ్యతలను అప్పగించడం ద్వారా రూపురేఖలే మారనున్నాయి. ‘ధరణి’ పోర్టల్ లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరుగా నమోదు చేయడం సంబంధిత శాఖలను విలీనం చేయాలన్న ఆలోచనల నుంచే పుట్టినట్లు ఉద్యోగులు భావిస్తున్నారు. ఆదివారం నాటి సమావేశంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనుమతి పొందిన ప్లాట్ల వరకే..
‘ధరణి’ పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును త్వరలోనే ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టనున్నారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే గడిచిన రెండు నెలలుగా ఎలాంటి లావాదేవీలు లేకపోవడంతో ప్రభుత్వం రూ.వందల కోట్లు నష్టపోయింది. ఇంకా జాప్యం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని గుర్తించినట్లు తెలుస్తోంది.