ప్రగతి భవన్‌ను తాకిన హైకోర్టు ఆగ్రహం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న విషయంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన కామెంట్లు, ఆగ్రహం, అసంతృప్తి ప్రగతి భవన్‌ను తాకాయి. కరోనాపై ప్రగతి భవన్‌లో సీఎం మంగళవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులకే కాకుండా మిగిలిన విభాగాల అధికారులు కూడా సీఎంకు మొరపెట్టుకున్నారు. హైకోర్టులో దాఖలవుతున్న ‘పిల్’ల విచారణకు హాజరుకావడానికే ఎక్కువ సమయం పోతోందని, అసలు పనికి ఆటంకం కలుగుతోందని, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం […]

Update: 2020-07-21 09:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న విషయంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన కామెంట్లు, ఆగ్రహం, అసంతృప్తి ప్రగతి భవన్‌ను తాకాయి. కరోనాపై ప్రగతి భవన్‌లో సీఎం మంగళవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులకే కాకుండా మిగిలిన విభాగాల అధికారులు కూడా సీఎంకు మొరపెట్టుకున్నారు. హైకోర్టులో దాఖలవుతున్న ‘పిల్’ల విచారణకు హాజరుకావడానికే ఎక్కువ సమయం పోతోందని, అసలు పనికి ఆటంకం కలుగుతోందని, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం, పత్రికల్లో వస్తున్న వార్తలు ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల ఆవేదనను ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించే విషయంలో, వైద్యం అందిస్తున్న విషయంలో, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనినీ తెలపాలని స్పష్టం చేశారు.

అధికారుల ఆవేదన :

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు నిర్వహించడంలోనూ, చికిత్స అందించే విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం బాధగా ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు వారి అభిప్రాయాలు వెల్లడించారు. “కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 ‘పిల్స్’ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకినవారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నాం. వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో తక్షణం చేయాల్సిన పనిని వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే విలువైన కాలం సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం” అని అధికారులు మొరపెట్టుకున్నారు.

వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని, అయినా తెలంగాణ ప్రభుత్వం, వైద్యశాఖ, వైద్యాధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఓ సీనియర్ అధికారి సీఎంకు వివరించారు. ఎంత మంది పేషెంట్లకైనా వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రతీరోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంత చేసినా హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు పని వదిలేసి కోర్టుకు హాజరుకావాల్సి వస్తోంది

మృతదేహాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని గతంలో ఎవరో పిల్ దాఖలు చేస్తే హైకోర్టు సైతం దానికి అనుకూలంగానే ఆదేశాలు జారీచేసిందని, వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. అయినా హైకోర్టులో ఇప్పటికీ ‘పిల్స్’ దాఖలవుతూనే ఉన్నాయని, హైకోర్టు కూడా వాటిని స్వీకరిస్తూనే ఉందని సీఎంకు వివరించారు. వివిధ రకాల పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నదని, కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడంలేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయని, ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నదని సీఎం సమక్షంలో ఒక తరహాలో నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే ఆ పరిస్థతిని తీసుకొచ్చింది : శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి

“కరోనా కట్టడి విషయంలో హైకోర్టులో ఇంత భారీ సంఖ్యలో ‘పిల్స్’ దాఖలయ్యే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొచ్చింది. ప్రజల బాధలను, నిరసనలను, ఆందోళనలను ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. సలహాలను, సూచనలను, విజ్ఞప్తులను, చివరకు నిరసనలను కూడా స్వీకరించే పరిస్థితిలో లేదు. మొండిగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కుంభకర్ణుడి నిద్రలో ఉంది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఇక మిగిలిన ఏకైక వేదిక న్యాయస్థానం మాత్రమే. ఇప్పటికైనా ప్రజలకు ఆ వ్యవస్థమీదనే గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయం కోసం వెళ్ళాల్సి వస్తోంది. నిజానికి హైకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యల వల్లనే ప్రభుత్వంలో ఎంతో కొంత చలనం, స్పందన వస్తోంది. కోర్టుకు వెళ్ళాలని సామాన్యులెవరూ కోరుకోరు. అది ఒక వినోద స్థలమో లేక విరామం కోసమో వెళ్ళే స్థలం కాదు. అయినా వెళ్ళాల్సి వస్తోండటంతో ప్రభుత్వ విధానాలే అందుకు కారణం. సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకదు. ప్రైవేటు ఆసుపత్రులకు పేదలు వెళ్ళలేరు. విజ్ఞప్తులను పట్టించుకోదు. సూచనలను స్వీకరించదు. నిరసనలతో రోడ్డుమీదకొస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. అయినా న్యాయం జరుగుతుందనే ఏకైక నమ్మకంతో కోర్టుల మీద ఉన్న విశ్వాసంతో పిల్’లు వేయక తప్పడంలేదు” అని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News