సాగు పద్ధతి మారాలి: కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ఈ వర్షాకాలంతోనే నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని.. ప్రతీ ఏటా.. ప్రతీ సీజన్‌లో.. ఇదే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం వ్యవసాయ శాఖ అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిపై సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల […]

Update: 2020-06-03 11:21 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ఈ వర్షాకాలంతోనే నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని.. ప్రతీ ఏటా.. ప్రతీ సీజన్‌లో.. ఇదే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం వ్యవసాయ శాఖ అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిపై సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. వ్యవసాయం లాభసాటిగా మార్చడం ద్వారా.. రైతులు తమ పంటకు గిట్టుబాటు రాలేదన్న దుస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం.. రైతుల సహకారంతో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి నిరాశ వ్యక్తం చేశారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప.. బలవర్థకమైన ఆహారం తినడం లేదన్నారు. ప్రజలు పోషకాహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలని.. అలాంటి పంటలనే రైతులు పండించాలని సీఎం చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధక శక్తి పెరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

నిరంతరం నియంత్రిత సాగు:

మన రాష్ట్రంతో పాటుగా దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలని, ఏ ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకొని.. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలన్నారు. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కావొద్దని, నిరంతరం సాగాలని చెప్పారు. వానాకాలం సాగుతో మొదలయ్యే నియంత్రిత సాగు ప్రతి ఏటా కొనసాగాలన్నారు. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుందని, నిపుణుల, నిష్ణాతులను ఈ కమిటీలో ఉంటారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్, మార్కెటింగ్, ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, ఏ పంటలు వేయడం వల్ల లాభం కలుగుతుందో చెప్పి దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలని సీఎం కేసీఆర్ వివరించారు.

సాగు పద్ధతులు మారాలి:

వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం కూడా చాలా ముఖ్యమని, సాగు పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు అవలంభించాలని, ఎరువులు, పురుగు మందుల వాడకంలో కూడా శాస్త్రీయత ఉండాలని, మేలు రకమైన విత్తనాలు వేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలని, యాంత్రీకరణకు అనుగుంగా సాగు జరగాలని, ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం అగ్రికల్చర్ రీసెర్చి కమిటీని నియమిస్తుందన్నారు. కమిటీ సూచించిన విధంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని సీఎం సూచించారు. అదే విధంగా తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నారని, పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? తదితర విషయాలను అధ్యయనం చేసి, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని సీఎం ప్రకటించారు.

పండ్లు, కూరగాయలను స్థానికంగానే పండించాలి:

మనం నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నామని, ఏ ఏ రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నామో లెక్కలు తీయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటిని మన రాష్ట్రంలోనే పండించేందుకు ప్రణాళికలు చేయాలని, పండ్లు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుందని, అందుకే పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలని, దీనివల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News