మిడతల దండును తరిమికొడదాం

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పలు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి అవసరమైన క్రిమిసంహారక మందులను సిద్ధం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న ఈ దండు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోడానికి వీలుగా ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచే ఈ కమిటీ నాలుగు […]

Update: 2020-05-28 08:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పలు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి అవసరమైన క్రిమిసంహారక మందులను సిద్ధం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న ఈ దండు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోడానికి వీలుగా ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచే ఈ కమిటీ నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేసి హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటుందని, మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తుందని సీఎం తెలిపారు. ప్రగతి భవన్‌లో అటవీ, వ్యవసాయ, విపత్తు నిర్వహణ విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులతో సమీక్షించిన కేసీఆర్ పలు సూచనలు చేశారు.

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ శోభ, డిసాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ డీజీ సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ తదితరులతో చర్చించారు.

ప్రస్తుతం దేశంలో మిడతల దండు ప్రవేశించింది మొదలు దాని ప్రయాణం, ప్రభావం, రాబోయే రోజుల్లో ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది తదితర అంశాలపై ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని ముఖ్యంమంత్రికి అధికారులు వివరించారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనాకు వచ్చారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

‘‘ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారు. అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. గాలి మరలి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దుల్లోనే వాటి ప్రవేశాన్ని నివారించడానికి పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గోదావరి తీరంలో కమిటీ పర్యవేక్షణ

మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం నియమించిన కమిటీలో సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతి ఉన్నారు. ఈ కమిటీ హెలికాప్టర్ ద్వారా గోదావరి తీరం వెంట పర్యటిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాథియాన్, క్లోరో ఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, విపత్తు నిర్వహణ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ తగిన చర్యలు చేపట్టాలన్నారు.

Tags:    

Similar News