సాగర్ ప్రజల్లారా.. ఆగం కావొద్దు.. ఆలోచించండి: కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను 60 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ఆగమాగం చేసిందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. పదవుల కోసం తెలంగాణను బలి చేశారని విమర్శించారు. తనకు 30 ఏండ్ల అనుభవం ఉందంటున్న జానారెడ్డి నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం డిగ్రీ కాలేజీని కూడా తేలేదని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. హాలియాలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే […]

Update: 2021-04-14 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను 60 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ఆగమాగం చేసిందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. పదవుల కోసం తెలంగాణను బలి చేశారని విమర్శించారు. తనకు 30 ఏండ్ల అనుభవం ఉందంటున్న జానారెడ్డి నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం డిగ్రీ కాలేజీని కూడా తేలేదని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా.. హాలియాలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధించారు.

ఆగమాగం కావొద్దు.. వాస్తవాలు చూడండి

ప్రజలతో సీఎం కలవకూడదని ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యంలో తలా తోకా లేని వ్యవహారానికి తెరలేపారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తాను చెప్పేది ఏది కూడా వేదం కాదని.. ప్రజలు నిజం, న్యాయం ఏంటో తెలుసుకునే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. వాస్తవాలు మొత్తం ప్రజల ముందే ఉన్నాయని చెప్పారు. విచక్షణ, విషయాన్ని గమనిస్తేనే జనాలకు మేలు జరుగుతుందన్నారు. లెఫ్ట్ పార్టీలో ఉంటూనే ఎన్నో సేవలు చేసిన నోముల నర్సింహయ్య.. అధికార పార్టీలో వచ్చి అదే సేవను కొనసాగించారన్నారు. ఇదే సమయంలో ఆయన మరణం బాధించిందన్న కేసీఆర్.. నోముల ఆశయాల సాధన కోసం భగత్‌ను అభ్యర్థిగా నిలబెట్టినట్టు మరోసారి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నాయకులపై విమర్శలు

హాలియా సభలో సీఎం కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. తెలంగాణను 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. 30 ఏండ్ల అనుభవం ఉందంటున్న జానారెడ్డి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు డెవలప్ కాకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని చెప్పుకొచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు అన్యాయం చేశారన్నారు. ఇటువంటి సమయంలో పదవులు వద్దు.. తెలంగాణ అభివృద్ధే కావాలని గులాబీ జెండా కోసం ముందుకొచ్చానని ఉద్యమ నేత గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనంటూనే.. వాస్తవాలు కూడా ప్రజల ముందు ఉన్నాయని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ కాదు.. ప్రజలు పెట్టిన బిచ్చమే..!

కేసీఆర్‌కు సీఎం పదవి కాంగ్రెస్, జానారెడ్డి పెట్టిన బిచ్చమంటున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు పెట్టిన బిచ్చంతోనే సీఎంను అయ్యానంటూ చెప్పుకొచ్చారు. అందుకే గత 60 ఏండ్లుగా లేని అభివృద్ధిని.. టీఆర్ఎస్ వచ్చాక చేసి చూపించానన్నారు. ఇక నాగార్జునసాగర్‌ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుకొస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని పేద ప్రజలకు న్యాయం చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ‘తిరుమలగిరి సాగర్’ను ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని.. బిచ్చమెత్తైనా సరే నిర్మాణం కోసం కట్టుబడి ఉంటామన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఇందుకోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు సీఎం అభినందించారు.

ధరణిపై ప్రశంసలు…

ఇదే సభలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌పై ప్రశంసలు కురింపించారు. ధరణిలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి రూ. 5 వేలు చొప్పున సంవత్సరానికి రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. ఇంత పారదర్శకంగా పాలన చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉంటే ఇంత అభివృద్ధి జరుగుతుందో లేదో ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలన్నారు. అందుకే ఎన్నికలు రాగానే ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందో.. ముందు.. వెనుక ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలియజేశారు. కాగా, ఈ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ‌పై పెద్దగా మాట్లాడకపోవడం గమనార్హం.

Tags:    

Similar News