మరియమ్మ లాకప్‌ డెత్‌పై సీఎం సీరియస్.. కుటుంబానికి ఎక్స్ గ్రేషియా

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మృతి బాధాకరమని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. దళితులపై దాడులు జరిగితే సహించేది లేదని, వారి మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనకు కారణమైనవారిపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగకూడదని, అవసరమైతే […]

Update: 2021-06-25 08:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మృతి బాధాకరమని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. దళితులపై దాడులు జరిగితే సహించేది లేదని, వారి మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనకు కారణమైనవారిపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగకూడదని, అవసరమైతే ఉద్యోగంలోంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. తక్షణమే విచారణ జరిపి నిజనిర్ధారణ చేయాలని నొక్కిచెప్పారు. బాధితురాలి గ్రామానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి రావాలని సూచించారు.

దళితుల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉన్నదని, పోలీసుల ఆలోచనా ధోరణి కూడా మారాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితుల పట్ల, పేదల పట్ల పోలీసుల ఆలోచన సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రత్యేక గుర్తింపు, గుణాత్మక వృద్ధిని సాధించిన రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. లాకప్‌డెత్ సంఘటనలను ప్రభుత్వం క్షమించబోదన్నారు.

మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరపు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషయా చెల్లించనున్నట్లు తెలిపారు. మరియమ్మ కుమారుడి కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, కుటుంబానికి నివాస గృహాన్ని ఉచితంగా అందిస్తామని, ఆమె ఇద్దరు కుమార్తెలకు తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఆ ప్రకటనలో వివరించారు. మృతురాలి ఇంటికి వెళ్ళి స్వయంగా ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

మరియమ్మ లాకప్‌డెత్ సంఘటనపై సీఎల్పీ నేత అయిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఆ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ చర్చించారు. వారు అందజేసిన వినతిపత్రాన్ని పరిశీలించారు. ఈ నెల 28న స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, జిల్లా కలెక్టర్ వెళ్ళి బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి రావాలని సీఎం సూచించారు.

Tags:    

Similar News