ఆయుష్మాన్ భారత్‌'తో 'ఆరోగ్యశ్రీ' అనుసంధానం

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అనుసంధానం చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్, పలు మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్రాల […]

Update: 2020-12-30 11:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అనుసంధానం చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్, పలు మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ఇకపైన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో అనుసంధానించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధానికి ఈ సమావేశంలో సోమేశ్ కుమార్ తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు అమలుచేయడంలేదు. కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కానీ చివరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలుచేయడానికి సిద్ధమనే నిర్ణయం తీసుకోక తప్పలేదు.

మరో ‘యూ టర్న్’

నియంత్రిత సాగు, ఎల్ఆర్ఎస్ లాంటి పలు నిర్ణయాల్లో వెనక్కు తగ్గిన తెలంగాణ ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ విషయంలోనూ యూ టర్న్ తీసుకుంది. తెలంగాణ అమలుచేస్తునన ‘ఆరోగ్యశ్రీ’తో పోలిస్తే కేంద్రం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’తో అదనంగా లబ్ధి జరిగేదేమీ లేదని 2019 సెప్టెంబరు (9వ తేదీ)లో పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించిన సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో ప్రతీ ఏటా సుమారు రూ. 1,336 కోట్లను ఖర్చు చేస్తోందని, దీని ద్వారా సుమారు 85.34 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని, దీంతో పోలిస్తే ‘ఆయుష్మాన్ భారత్’ ఎందుకూ పోల్చడానికి కూడా సరిపోదన్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా కేవలం పాతిక లక్షల మందికి మాత్రమే లబ్ధి జరుగుతుందని, కేంద్రం రూ. 250 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం లేదన్నారు. అందువల్లనే ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయదల్చుకోలేదని, దీనికి బదులుగా ఇప్పుడు కొనసాగుతున్న ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్నే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా అమలుచేయదల్చుకోలేదని, నిశితంగా అధ్యయనం చేస్తుందని, ఆ తర్వాతనే అమలుచేస్తుందని కేసీఆర్ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాదాపు పాతిక రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోందని, కానీ ఆయుష్మాన్ భారత్ పథకం కిందికి ఈ సర్జరీలు రావని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందే అవకాశం లేదని వివరించారు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నందునే డబ్బులకు కష్టమైనా పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య శ్రీ పథకాన్నే కొనసాగించదల్చుకున్నదని, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేయదల్చుకోలేదని అసెంబ్లీ వేదికంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మద్దతు తెలుపుతున్నట్లుగానే ఆయుష్మాన్ భారత్ విషయంలోనూ ఇంతకాలం ఉన్న వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని జోడించి తెలంగాణ ప్రభుత్వం ‘డబుల్ బెడ్‌రూమ్’ ఇళ్ళ పథకాన్ని అమలుచేస్తోంది. ఇప్పుడు కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా వచ్చే నిధులను ఆరోగ్యశ్రీ పథకానికి జోడించి అమలుచేయనుంది.

Tags:    

Similar News