కేంద్రానిది పోస్ట్​మాన్​ డ్యూటీ.. శాసన సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారనే వ్యాఖ్యలు సరి కాదని సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రాలకు ఫైనాన్స్​ కమిషన్​ కేటాయింపులు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఉండవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం పోస్ట్​మాన్​ డ్యూటీ మాత్రమే చేస్తున్నదని తెలిపారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈజీఎస్​ నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం […]

Update: 2021-10-07 23:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారనే వ్యాఖ్యలు సరి కాదని సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రాలకు ఫైనాన్స్​ కమిషన్​ కేటాయింపులు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఉండవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం పోస్ట్​మాన్​ డ్యూటీ మాత్రమే చేస్తున్నదని తెలిపారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈజీఎస్​ నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం ఫైర్​ అయ్యారు. కొన్ని ట్యాక్స్‌లు కేంద్రం, రాష్ట్రం వ‌సూలు చేస్తున్నదని, కేంద్రం వ‌సూలు చేసే ప‌న్నుల్లో నుంచి క్ర‌మానుగుణంగా, ఫైనాన్స్ క‌మిష‌న్ రిపోర్ట్ ఆధారంగా ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుద‌ల చేయాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. వీటికి కేంద్రం పోస్టుమాన్​లానే వ్యవహరిస్తున్నదన్నారు. కేంద్రం నిధులు అనేవి ఉండ‌వని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటేనన్నారు. కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి వేస్తున్నారని, అలాంటప్పుడు సర్పంచ్​లు, ఎంపీటీసీల వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. పన్నులు కూడా మొత్తం కేంద్రమే తీసుకుంటున్నదని చెప్పారు. పెట్రో, డీజిల్​ ట్యాక్స్​లను తీసుకునేందుకు ప్రయత్నించిందని, బీజేపీ సీఎంలే వ్యతిరేకించారన్నారని తెలిపారు.

హరితహారం లక్ష్యం సాధించేందుకే..

‘2018 పంచాయతీరాజ్​ చ‌ట్టం త‌ర్వాత 85% మొక్క‌లు బ‌తికి ఉండ‌క‌పోతే మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్, గ్రామాల్లో పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ, కౌన్సిల‌ర్, స‌ర్పంచ్ ఉద్యోగం పోతుంది’ అని చ‌ట్టంలో పేర్కొన్నామని, దీనిపై పంచాయ‌తీరాజ్ ట్రిబ్యున‌ల్ పెట్టామని సీఎం వివరించారు. హరితహారం ల‌క్ష్యం సాధించేందుకే ఈ నిబంధ‌న పెట్టామని, అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మొక్కలు బతికాయన్నారు. దేశంలోనే ప్ర‌థమంగా క‌లెక్ట‌ర్ లోక‌ల్ బాడీస్ అనే పోస్టు పెట్టి, వాహ‌నాలు కొనిచ్చామని, వీరు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అభివృద్ధిని ప‌ర్య‌వేక్షిస్తారని, ఇప్పుడు నివేదికల ప్ర‌కారం 90% మొక్క‌లు పైబ‌డి బ‌తికి ఉన్నాయని తెలిపారు. మొక్క‌లు బ‌త‌క‌ని గ్రామాలుంటే త‌మ దృష్టికి తీసుకువ‌స్తే.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే చ‌ర్య‌లు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

సర్పంచ్​ల కంటే సఫాయిలకే ఎక్కువ జీతం..

రాష్ట్రంలో స‌ర్పంచ్‌ల కన్నా స‌ఫాయి కార్మికుల‌కే ఎక్కువ జీతం ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. కాంగ్రెస్ హ‌యాంలో జీహెచ్ఎంసీ కార్మికుల‌కు రూ. 8,500 ఇస్తే.. ప్రస్తుతం రూ. 17 వేలు ఇస్తున్నామని, స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీల కన్నా చాలా ఎక్కువని చెప్పారు. గ్రామపంచాయ‌తీ సిబ్బందికి రూ. 8500 చొప్పున‌, మున్సిపాలిటీల్లో రూ. 12 వేల‌కు త‌గ్గ‌కుండా జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు స‌ర్పంచ్‌ల గౌర‌వ వేత‌నాలు చాలా త‌క్కువ‌ ఉండేవని, జడ్పీ చైర్మన్లకు గ‌తంలో రూ. 7,500 ఉంటే ఇప్పుడు రూ. ల‌క్ష ఇస్తున్నామని, జ‌డ్పీటీసీల‌కు గ‌తంలో రూ. 2,250 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు, మండ‌ల ప్ర‌జా పరిషత్​ స‌భ్యుల‌కు గ‌తంలో రూ. 1,500 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు, స‌ర్పంచ్‌లు, ఎంపీటీల‌కు రూ. 6,500ల‌కు పెంచామని, లోక‌ల్ బాడీస్ కు ఇచ్చే నిధుల్లో కేంద్రం 25% కోత విధించిందని సీఎం తెలిపారు. ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్ స్తంభాల‌ను ఏర్పాటు చేశామని, 59 వేల కి.మీ. మేర విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశామని, ఇంకా ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్కరిస్తామని సభాముఖంగా సీఎం ప్రకటించారు.

పల్లె దవాఖానలు.. ప్రతి పంచాయతీకి కార్యదర్శి..

హైదరాబాద్​లో 350 బస్తీ దవాఖానలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, డివిజన్​కు రెండు,మూడు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అదే మాదిరిగా పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల‌కు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలు ఉన్నారని వివరించారు. టాప్ టు బాట‌మ్ అన్ని పోస్టుల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చామని, కొత్త‌గా అవ‌స‌ర‌మైన చోట నియామ‌కాలు జ‌రిపామని, మ‌హిళ‌ల‌కు ప్ర‌సూతి సెల‌వులు ఇచ్చిన‌ప్పుడు.. వారి స్థానంలో కొత్త వారిని నియ‌మించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించినట్టు చెప్పారు. ఎక్కడ ఖాళీ ఏర్ప‌డ్డా వారం రోజుల్లోనే నియ‌మిస్తున్నామని వివరించారు. గతంలో మంచినీళ్ల గోస ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న మిష‌న్ భ‌గీర‌థ‌ను చూసి నీతిఆయోగ్ ప్ర‌శంసించిందని, రూ. 24 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్రానికి సూచిస్తే 24 పైస‌లు కూడా ఇవ్వ‌లేదని, అవార్డులు మాత్రం మోయ‌లేన‌న్ని వ‌చ్చాయని సీఎం చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ పుణ్య‌మా అని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ విజ‌యం సాధించిందని సీఎం పేర్కొన్నారు.

వక్ఫ్​ భూముల విచారణపై అభ్యంతరం లేదు..

వ‌క్ఫ్ బోర్డు భూముల విచార‌ణ‌కు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ‌, వ‌క్ఫ్ బోర్డులు ఫ్రీజ్ అయ్యాయని, గ‌వ‌ర్న‌మెంట్ ప‌రంగా వాటిని ఎట్టి ప‌రిస్థితుల్లో రిజిస్ట్రేష‌న్లు చేయ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు. కొన్ని సంద‌ర్భాల్లో కోర్టుల్లో మ‌న వారు స‌రిగా వాదించ‌డం లేదని అక్బ‌రుద్దీన్ ఓవైసీ అంటున్నారని, వ‌క్ఫ్ బోర్డుల విష‌యంలో జ‌రిగిన దారుణాల‌పై సీబీసీఐడీ విచార‌ణ‌కు ఇవాళే ఆదేశిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News