ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త..
దిశ, ఏపీ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలపై ఏపీ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షత జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వెళ్లడించారు. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాలు.. డిసెంబరు 25వ తేదీన మొత్తం 30.6 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం రూ.23 వేల కోట్ల విలువైన […]
దిశ, ఏపీ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలపై ఏపీ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షత జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వెళ్లడించారు.
డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాలు..
డిసెంబరు 25వ తేదీన మొత్తం 30.6 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అందులో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి, 22,342 ఎకరాల ప్రైవేటు భూమి లే అవుట్లు వేశారు. ప్రస్తుతం లబ్ధిదారులకు డీ ఫాం పట్టాలు పంపిణీ చేస్తారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక కన్వెయిన్స్ డీడ్ ఇస్తారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లే అవుట్లలో గృహ నిర్మాణం చేపడతారు. వైఎస్సార్–జగనన్న కాలనీల పేరిట 28.3 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తుంది. మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలిదశలో 8,494 లేఅవుట్లలో సుమారు 16 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ. 1.8 లక్షల చొప్పున తొలిదశ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ. 28,800 కోట్లు వెచ్చించనున్నారు. 18 నెలల్లో, 2022 జూన్ నాటికి మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 25 నుంచి మొదలుపెట్టి రెండు వారాల పాటు ప్రతిరోజూ లక్ష చొప్పున ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. మిగిలిన 13 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని 2021 డిసెంబరులో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
30లోగా పంట నష్ట పరిహారం..
23 నుంచి 26 తేదీల మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 188శాతం అధికం. 664 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. 673 ఇళ్లు దెబ్బతిన్నాయి. 147 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 10 వేల మందికిపైగా ఆహారం అందించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున ఇచ్చి ఇంటికి పంపాలి. గురువారం దాకా అందిన ప్రాథమిక వివరాల ప్రకారం 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 16,290 హెక్టార్లలో వరి, 7,362 హెక్టార్లలో మినుము, 3,571 హెక్టార్లలో పత్తి, 2,529 హెక్టార్లలో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో 10,300 హెక్టార్లు, చిత్తూరులో 10,166 హెక్టార్లు, కడపలో 4,886 హెక్టార్లు, నెల్లూరులో 4,400 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. 1,371 హెక్టార్లలో ఉద్యానవన పంటలు పాడయ్యాయి. పంట నష్టం అంచనాలను డిసెంబరు 15లోగా సేకరించాలి. 30లోగా పరిహారం చెల్లించాలి. ప్రాణ, ఆస్తి నష్టానికి పరిహారమివ్వాలి.
ఇంకా..
పోలవరం ఒరిజినల్ డిజైన్ ప్రకారం నిర్మాణం చేపట్టాలి. ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి 3.144 శాతం డీఏ పెంచాలి. త్వరలో 2, 3 డీఏలు చెల్లించాలి. కరోనా సమయంలో ఆపిన మార్చి నెల వేతనాన్ని డిసెంబర్‌లో, ఏప్రిల్ నెలలో పెండింగ్ బకాయిలను జనవరిలో అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తారు. డిసెంబర్ 2న ఆమూల్ పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచే లీటర్ పాలకు అదనంగా రూ.4 చెల్లిస్తారు. డిసెంబర్ 21న సమగ్ర భూసర్వేను సీఎం జగన్ ప్రారంభిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్, పల్నాడు ప్రాజెక్టుల కోసం ఎస్పీవీలు ఏర్పాటు చేస్తారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్, ఎలక్ట్రానిక్ క్లస్టర్‌కు ప్రోత్సాహకాలు ఇస్తారు. రాజధాని స్టార్టప్ ప్రాజెక్టులను రద్దు చేశారు. ఏడీపీ లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వడానికి నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి : జగన్
30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అందరూ సిద్ధం కావాలని సీఎం జగన్ సూచించారు. హోమ్‌వర్క్ చేయకుండా సభకు వస్తే అబాసు పాలవుతామని హెచ్చరించారు. శాసన మండలిలో వ్యూహంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మంత్రి బుగ్గన సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.అసెంబ్లీ సమావేశాలు సుమారు ఐదురోజులపాటు జరిగే అవకాశముంది.