చేపల చెరువు కోసం కొట్లాట.. ఎవరు చెప్పేది నిజం..?
దిశ, అనంతగిరి: చెరువు కోసం గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటన శుక్రవారం మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దళితులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘గత 40 సంవత్సరాలుగా దాదాపు 12 ఎకరాల చేపల చెరువును ప్రతి సంవత్సరం వేలం పాటతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకై వినియోగించుకుంటున్నాం.. గత 4-5 సంవత్సరాల క్రితం చెరువు వేలం పాటకు సంబంధించి వచ్చిన కొంత నగదును ఆనాటి సర్పంచ్ దళితులకు పంపిణీ చేయనీయకుండా […]
దిశ, అనంతగిరి: చెరువు కోసం గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటన శుక్రవారం మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దళితులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘గత 40 సంవత్సరాలుగా దాదాపు 12 ఎకరాల చేపల చెరువును ప్రతి సంవత్సరం వేలం పాటతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకై వినియోగించుకుంటున్నాం.. గత 4-5 సంవత్సరాల క్రితం చెరువు వేలం పాటకు సంబంధించి వచ్చిన కొంత నగదును ఆనాటి సర్పంచ్ దళితులకు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్నారు. నాటి నుంచి నేటి వరకు చెరువులో చేప పిల్లలు పోయకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడుతూ దళితులకు ఆ చెరువుపై ఆధిపత్యం లేకుండా చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుత గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు’.
సర్పంచ్ నిర్లక్ష్య వైఖరితో విసుగుచెంది చెరువులో కొద్ది రోజుల క్రితం చేపలు విడుదల చేశామని దళితులు చెప్పుకొచ్చారు. కానీ, పలువురి సహకారంతో సర్పంచ్ వలలను తీసుకెళ్లిపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగామన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పంచాయతీ ఆఫీసులో శుక్రవారం పంచాయితీ ఉంటుందని చాటింపు చేశారు. ఈ చాటింపు విన్న గ్రామస్తులు శుక్రవారం పెద్ద ఎత్తున గ్రామ సర్పంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దళితుల ముందే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన చున్నీ లాగాడని ఎంపీటీసీ అనూష ఆరోపించారు. ఈ క్రమంలో పంచాయితీకి పిలిచి అవమానిస్తారా అంటూ దళితులు, దళిత ప్రజాప్రతినిధులతో వేరే వర్గం వారికి ఘర్షణ జరిగిందని.. ఈ గొడవలో పలువురికి గాయాలు అయినట్టు అనూష చెప్పుకొచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
సర్పంచ్ బద్దం కృష్ణారెడ్డి వివరణ..
‘గ్రామానికి సంబంధించిన చెరువులో ప్రతియేటా చేప పిల్లలు వేసే క్రమంలో.. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి విరుద్ధంగా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన కొంతమంది చెరువులో చేప పిల్లలు విడుదల చేస్తున్నారని గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో వారితో కలిసి చెరువు వద్దకు వెళ్లి అడ్డుకున్నాను. ఇదే విషయమై సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాను. ఈ సమావేశానికి హాజరై మాట్లాడుతున్న క్రమంలో గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు కొందరు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన గ్రామస్తులపై దాడికి దిగారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన దంపతులకు గాయాలు అయ్యాయి’. అంటూ సర్పంచ్ చెప్పుకొచ్చారు. చెరువు గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించినదేనని సర్పంచ్ ముక్తకంఠంతో తెలుపుతూ అధికారులు విచారణ జరిపి నిజనిర్ధారణ చేయాలన్నారు.