Sai Kumar: సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం.. రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ ట్వీట్ వైరల్
సాయి కుమార్(Sai Kumar) అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీతో ఇండియన్ సినిమా హిస్టరీలో చెరగని ముద్ర వేసుకున్నారు.
దిశ, సినిమా: సాయి కుమార్(Sai Kumar) అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీతో ఇండియన్ సినిమా హిస్టరీలో చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జులై 27న సాయి కుమార్(Sai Kumar) జన్మించారు. తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. తల్లి కృష్ణ జ్యోతి(Krishna Jyoti) ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్‌కు కన్నడ మాతృ భాష అయింది. కానీ సాయి కుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తన మార్క్ వేశారు. సినిమాల్లోకి రాక ముందు అంటే.. సరిగ్గా 1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. మయసభ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సాయికుమార్ ‘దేవుడు చేసిన పెళ్లి’(Devudu Chesina Pelli)తో తెరంగేట్రం చేశారు.
ఆ సినిమా 1975లో జనవరి 9న రిలీజ్ అయింది. అంటే నేటికి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తరువాత బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి కుమార్ కెరీర్లో ఎన్నో మరుపు రాని హిట్ చిత్రాలున్నాయి. కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ మూవీస్‌లో ఆయన నటించారు. 2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానంకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్సార్-టీవీ 9 అవార్డును అందుకున్నారు.
ఇక వెండితెరపైనే కాకుండా మాంచి కిక్కిచ్చే గేమ్ షో అంటూ బుల్లితెరపై ‘వావ్’ అనిపించుకున్నారు సాయి కుమార్. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తే అది బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది. గత ఏడాది సాయి కుమార్ నటించిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్(Lucky Bhaskar) వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు సాయి కుమార్ ఇండస్ట్రీలో అందరికీ లక్కీ హ్యాండ్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో సాయి కుమార్ ముందుంటారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తి అయినా కూడా లెక్కకు మించిన ప్రాజెక్టుల్లో భాగం అవుతూ బిజీగా ఉండటం ఒక్క సాయి కుమార్‌కే చెందింది. ఇక ఆయన కుమారుడిగా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ సైతం చేతినిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సాయి కుమార్ మున్ముందు మరిన్ని చిత్రాలు, మంచి పాత్రలతో ఆడియెన్స్‌ను అలరిస్తూ ఉండాలని కోరుకుందాం. అయితే ఆయన ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతుకు రుణపడి ఉంటాను అని రాసుకొచ్చారు.