వానొచ్చిందంటే రాత్రంతా జాగారం.. రహదారులన్నీ బంద్
దిశ, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొంతమంది ఇండ్లలోకి నీరు వచ్చి చేరడంతో గత్యంతరం లేక సొంత ఇల్లు విడిచి కిరాయి ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే చిట్యాల మండల కేంద్రం అటు రాజకీయంగా ఇటు భౌగోళికంగా పేరు గాంచినది. మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిత్యం పర్యటిస్తూనే ఉంటారు. కానీ, వారి అసమర్థత […]
దిశ, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొంతమంది ఇండ్లలోకి నీరు వచ్చి చేరడంతో గత్యంతరం లేక సొంత ఇల్లు విడిచి కిరాయి ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి.
వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే చిట్యాల మండల కేంద్రం అటు రాజకీయంగా ఇటు భౌగోళికంగా పేరు గాంచినది. మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిత్యం పర్యటిస్తూనే ఉంటారు. కానీ, వారి అసమర్థత వల్ల ప్రధాన రహదారి, వీధుల్లో సైడ్ డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇండ్లు, షాపులలోకి వరదనీరు వచ్చి చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు.అలాగే మండల కేంద్రంలోని చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న పీఎసీఎస్, వ్యవసాయ శాఖ కార్యాలయానికి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో నడక దారి లేకుండా పోతోంది. పక్కనే ఉన్న ఓ గ్రామస్థుడి ఇల్లు నీళ్లలోనే మగ్గిపోతున్నది. ఇదంతా పాలకులకు తెలిసినా వారు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
వానొస్తే దారులు బంద్..
మండల కేంద్రంలో భారీ వర్షం కురిస్తే పీఎసీఎస్, వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లే దారి లేకుండా పోతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతూ కొనసాగుతున్న శాశ్వత పరిష్కారం చూపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన రహదారుల వెంట సైడ్ డ్రైనేజీలు లేకపోవడం వల్లనే వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి సత్వర పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
కాలనీల్లోనూ ఇదే పరిస్థితి..
మండల కేంద్రంలోని హనుమాన్ నగర్, మరికొన్ని వీధుల్లో సీసీ రోడ్ల వెంట సైడ్ డ్రైనేజీలు లేకపోవడం వల్ల వరద నీరు ఇండ్ల లోకి వచ్చి చేరుతోంది. వరదల వల్ల ఇంట్లోని వంట సామగ్రి తడిసిపోవడంతో రాత్రి జాగారాలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు.
ప్రతీయేడు ప్రధాన రహదారికి గండి..
వరదల కారణంగా ప్రతీయేడు చిట్యాల చౌరస్తాకు కూతవేటు దూరంలోని ప్రధాన రహదారికి గండి కొడుతున్నారు. చెరువుకు సంబంధించిన వరద నీరు భారీగా జనావాసాల్లోకి వచ్చి చేరడంతో ప్రధాన రహదారులను సైతం లెక్కచేయకుండా జేసీబీ సాయంతో తవ్వేస్తున్నారు. దీనికి పాలకులు శాశ్వత పరిష్కారం చూపకపోవడం వారి అసమర్థతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వీధుల వెంట సీసీ రోడ్లను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని మండల కేంద్రంలోని ప్రజలు కోరుతున్నారు.