‘స్పేస్ రైస్’తో చైనా కొత్త ప్రయోగం.. తొలిపంట సిద్ధం!

దిశ, ఫీచర్స్ : ప్రయోగాలకు పెట్టింది పేరు చైనా. ఎత్తయిన భవనాలు నిర్మించాలన్నా, కొండకోనలకు గ్లాస్ వంతెనల హారం కట్టాలన్నా, జెట్ స్పీడ్ రైళ్లను ఇంట్రడ్యూస్ చేయాలన్నా చైనాతో సాధ్యమే. అంతేకాదు అంగారక గ్రహం మీదకు తొలిసారి ప్రయోగించిన ‘జురాంగ్’ అంతరిక్ష నౌక కూడా విజయం సాధించింది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించేందుకు యత్నిస్తున్న చైనా, తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో లోతైన అంతరిక్ష పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన విత్తనాల నుంచి తొలిసారిగా […]

Update: 2021-07-18 06:22 GMT

దిశ, ఫీచర్స్ : ప్రయోగాలకు పెట్టింది పేరు చైనా. ఎత్తయిన భవనాలు నిర్మించాలన్నా, కొండకోనలకు గ్లాస్ వంతెనల హారం కట్టాలన్నా, జెట్ స్పీడ్ రైళ్లను ఇంట్రడ్యూస్ చేయాలన్నా చైనాతో సాధ్యమే. అంతేకాదు అంగారక గ్రహం మీదకు తొలిసారి ప్రయోగించిన ‘జురాంగ్’ అంతరిక్ష నౌక కూడా విజయం సాధించింది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించేందుకు యత్నిస్తున్న చైనా, తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో లోతైన అంతరిక్ష పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన విత్తనాల నుంచి తొలిసారిగా వరిపంట పండించింది.

భారీ జనాభాతో సతమతమవుతున్న చైనా ప్రజలకు సరపడా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆహార భద్రత కోసం చైనా అనేక ప్రయోగాలు చేస్తుంది. అందులో భాగంగానే ‘స్పేస్ రైస్’ పండించే ప్రయత్నాలు గత ఏడాది మొదలుపెట్టగా, అంతరిక్ష పంటల సాగు కోసం బీజింగ్‌లో 2.4 మిలియన్ హెక్టార్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అందుకోసం తొలి ప్రయోగంగా చాంగ్ -5 మిషన్‌‌ను ఉపయోగించుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నవంబర్‌లో చైనా చాంగ్-5 వ్యోమనౌకను పంపించిన విషయం తెలిసిందే. ఇందులో 40 గ్రాముల బరువున్న 1,500 వరి విత్తనాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగా, చంద్రుడి చుట్టూ 23 రోజులపాటు 7.60 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన అనంతరం డిసెంబర్‌లో ఈ వ్యోమనౌక భూమికి తిరిగివచ్చింది. దీంతో పాటు ఆ ధాన్యం కూడా తిరిగి రాగా, దాదాపు మూడు వారాలపాటు రోదసిలోనే ఈ రైస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వరి విత్తనాలు కాస్మిక్ రేడియేషన్‌‌కు గురయ్యాయి. అంతేకాదు అక్కడ సున్నా గురుత్వాకర్షణ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ విత్తనాలను ఉపయోగించి దక్షిణ చైనా వ్యవసాయ యూనివర్సిటీలోని నేషనల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ప్లాంట్ స్పేస్ బ్రీడింగ్‌లో ప్రత్యేకంగా వీటిని సాగుచేశారు. ఈ బియ్యాన్నే ‘రైస్‌ ఆఫ్‌ హెవెన్‌’ లేదా ‘ స్పేస్‌ రైస్‌’గా పిలుస్తున్నారు. చంద్రుని వాతావరణ పరిస్థితుల వల్ల ఈ విత్తనాల్లో కొన్ని ఉత్పరివర్తనం(మ్యూటేట్) చెంది, అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట వస్తుందని చైనీస్ పరిశోధకులు భావిస్తున్నారు.

చైనా 1987 నుంచి అంతరిక్షంలోకి విత్తనాలను పంపుతుండగా, టొమాటో, పత్తి వంటి 200 పంటలపై కూడా ఈ తరహా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక మరో మూడు లేదా నాలుగేళ్ళలో ఈ స్పేస్ రైస్ పంట చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News