నిర్మల్ కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు.. ఎందుకంటే?

దిశ, ఆదిలాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించి హరితహారంలో నిర్మల్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. మొక్కలను నాటడమే కాకుండా.. నాటిన ప్రతి మొక్కనూ బతికించాలనే నినాదంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటిస్థానం దక్కడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Update: 2020-06-17 08:11 GMT

దిశ, ఆదిలాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించి హరితహారంలో నిర్మల్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. మొక్కలను నాటడమే కాకుండా.. నాటిన ప్రతి మొక్కనూ బతికించాలనే నినాదంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటిస్థానం దక్కడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ విజయం వెనక జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి ఉంది.

71% బతికిన మొక్కలు..

నిర్మల్ జిల్లాలో 2019- 2020 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ముమ్మరంగా మొక్కలు నాటారు. జిల్లాలో నాటిన మొక్కల్లో 71% మొక్కలు బతికాయి. ప్రస్తుతం ఈ మొక్కలు పెరిగే దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని క్రమంగా చెట్లుగా మారాయి. భవిష్యత్తులోనూ ఈ మొక్కలు ఏపుగా పెరుగుతాయని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అటవీశాఖ, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలను సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం విజయవంతం చేసింది. మొక్కలు నాటిన అప్పటి నుంచి ట్రీ గార్డ్స్ పెట్టడం, రోజూ రెండు పూటలా నీళ్లు పట్టడం వంటి చర్యలతో చాలావరకు మొక్కలు పెరిగాయి. అలాగే గ్రామాల్లో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బందికి మొక్కల పెంపకంపై ఖచ్చితమైన బాధ్యతలను అప్పగించారు. మొక్కల సంరక్షణకు అవసరమైన నీటి వినియోగానికి సంబంధించి ప్రత్యేక యంత్రాంగానికి ఆ పనులు అప్పగించారు. దీంతో జిల్లాలో 71% మొక్కలు బతికి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది.

సర్వే జరిగిన తీరు ఇది…

నిర్మల్ జిల్లాలోని 19 మండలాలలో ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా 2019 సంవత్సరానికి గాను నాటిన 1350 సైట్‌లలో మొక్కలు నాటారు. ఈ 1,350 ఏరియాల్లో మొత్తం 2550044 మొక్కలు నాటారు. ఇందులో 35 సైట్‌లను పరిశీలించగా… అందులో 326613 మొక్కలకు గాను 212705 మొక్కలు బతికిన్నట్టు గుర్తించారు.

అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా : కలెక్టర్ ముషారఫ్

హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా తొలి స్థానంలో నిలవడం.. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభినందించడం మర్చిపోలేను. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా వాసి కావడం.. అటవీ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అందించిన సహకారంతోనే జిల్లా తొలి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తాం. ఈ నెల 20 నుంచి నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని జయప్రదంగా రాష్ట్రంలో మళ్లీ మొదటి స్థానాన్ని పొందుతామన్న నమ్మకం ఉంది.

Tags:    

Similar News